తుపాకీతో బెదిరించి.. కత్తులతో నరికారు

4 Aug, 2018 12:50 IST|Sakshi
ఖాసీం అనుచరుడు మురళీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఖాసీం హత్య తీరు భయానకం

దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు

చిట్టిమాము గ్యాంగ్‌ కోసం పోలీసుల గాలింపు

పోలీసుల అదుపులో రౌడీషీటర్లు

మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

విశాఖ క్రైం/అల్లిపురం/ డాబాగార్డెన్స్‌: నగరంలో జరుగుతున్న రౌడీ షీటర్ల వరస హత్యలతో ప్రజలు నిర్ఘాంతమైపోతున్నారు. ఏ హత్యకు ఆ హత్య విభిన్న పంథాలో జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బైక్‌పై వస్తున్న ఖాసీంను ఆటోతో ఢీకొట్టడం, కింద పడ్డ అతన్ని తుపాకీతో గురిపెట్టి అచేతనంగా ఉంచి కత్తులతో దారుణంగా హత్య చేయడం.. అంతటా చర్చనీయాంశమైంది. విజయవాడ, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకే ఇలాంటి నేర సంస్కృతి.. ప్రశాంత విశాఖలో పురి విప్పడంతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొంది. రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖాసీంను గురువారం రాత్రి 10 గంటల సమయంలో హత్య  చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బైక్‌పై డైమండ్‌ పార్క్‌ నుంచి ఎల్‌ఐసీ బిల్డింగ్‌ మీదుగా ఖాసీం ఇంటికి వెళ్తున్నాడు. వెనుక ఆటోలో కత్తులతో వస్తున్న ప్రత్యర్థులు ఎల్‌ఐసీ భవనం ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టారు. ఖాసీం బైక్‌పై నుంచి పడిపోయాడు.

ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీ తీసి ఖాసీం తలపై గురిపెట్టాడని, ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఖాసీంను తుపాకీతో గురిపెట్టిన వ్యక్తి చిట్టిమాముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పిస్టల్‌ ఎవరిదనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కమిషనర్‌ లడ్డా ఆదేశాల మేరకు టూటౌన్, ఎంఆర్‌పేట పరిధిలో రౌడీ షీటర్లను తెల్లవారుజామున ఆరు గంటలకే స్టేషన్లకు తరలించారు. వారు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఖాసీం హత్య కేసులో అనుమానితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రధానంగా చిట్టిమాము, రుషికొండ మధు, రామాటాకీస్‌ మధు, టెక్కం లక్ష్మణ, షణ్ముఖ్, చలువతోట మధు, కల్యాణ్‌లతో పాటు మరికొంత మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. ఘటన అనంతరం చిట్టిమాముతో పాటు అతని భార్య కూడా కనిపించకపోవడంతో..ఈ కేసులో చిట్టిమాము పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఖాసీం పోస్టుమార్టం సమయంలో అతని అనుచరుడు మురళీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పాతకక్షలే కారణమని అనుమానం
ఖాసీం హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఖాసీం మేనల్లుడు తెలుగు అనిల్‌. అతని హత్య కేసులో ప్రధాన నిందితుడు పొడుగు కిరణ్‌ గ్యాంగ్‌కు, ఖాసీం గ్యాంగ్‌కు మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. పొడుగు కిరణ్‌పై రెండు సార్లు దాడులు జరగడం, కిరణ్‌ జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడం తదితర ఘటనలు చేసుకున్నాయి. మరో వైపు చిట్టి మాము తమ్ముడు హత్య కేసులో ఖాసీం ఒకడు. వన్‌టౌన్‌లో 1992లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఖాసీం. కప్పరాడలో జరిగిన జంట హత్య కేసులో చిట్టిమాము తమ్ముడిని ఖాసీం హత్య చేశారు. జిల్లా పరిషత్‌లో లచ్చా అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో కూడా ఖాసీం నిందితుడు. ఈ నేపథ్యంలో పొడుగు కిరణ్‌ వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న చిట్టిమాము, అతని అనుచరులు ఖాసీం పట్ల గుర్రుగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు గురువారం రాత్రి ఒంటరిగా దొరికిన ఖాసీంపై దాడికి పాల్పడి మట్టుబెట్టారు. హత్య అనంతరం వారంతా పరారయ్యారు.

నిందితుల కోసం మూడు బృందాలు..
ఖాసీం హత్య కేసులో దర్యాప్తు కోసం మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నాయి. ఖాసీం హత్య కేసును పోలీస్‌ కమిషనర్‌ లడ్డా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఖాసీం మృతదేహానికి పోస్ట్‌మార్టం
ఖాసీం మృతదేహానికి శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఖాసీం మద్దతుదారులు అధిక సంఖ్యలో మార్చురీకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా హడావుడిగా మారింది. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందుగానే మార్చురీ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ పరిసర ప్రాంతాల్లో గుంపుగా ఉన్న యువకులను చెల్లా చెదురు చేశారు. ప్రధాన గేట్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమతి లేనిదే ఎవర్నీ లోపలికి పంపలేదు. అనుమానం వచ్చిన వారిని గేట్‌ అవతలే ఉంచారు. గుర్తింపు కార్డు చూసి ఉద్యోగులను వదిలారు. అలాగే క్యాజువాల్టీ వద్ద పోలీసులు మొహరించారు. ఏవీఎన్‌ కాలేజ్‌ డౌన్‌రోడ్డులోని గేట్‌ను మూసివేశారు. అడుగడుగునా పోలీసులు ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని వార్తలు