పథకం ప్రకారం రౌడీషీటర్‌ హత్య

13 Feb, 2018 10:40 IST|Sakshi

 మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి

మృతుడు నాగరాజుపై హత్య, హత్యాయత్నం కేసులు

కిరాయి మనుషులతో ప్రత్యర్థులు అంతమొందించారన్న కోణంలో పోలీసుల విచారణ

నరసరావుపేట టౌన్‌: కత్తిపట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు అనే నానుడి రౌడీటర్‌ నాగరాజు హత్యతో నిజమైంది. ముస్లింల వేషధారణల్లో వచ్చిన ముగ్గురు యువకులు అతడ్ని కిరాతకంగా నరికారు. నాలుగు నిమిషాల్లో అంతా పని కానిచ్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ వారు చిక్కలేదు. ఉన్నతాధికారులు సత్పవర్తనతో జీవించాలని సూచించినప్పటికీ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో నేడు నాగరాజు కుటుంబం రోడ్డున పడిందని పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. వివరాల్లో కెళితే...ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ చీదనబోయిన నాగరాజు వురఫ్‌ బొల్లు నాగరాజు ఆదివారం రాత్రి అరండల్‌పేట గోల్డెన్‌ బిర్యానీ పాయింట్‌ ఎదుట దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

హోటల్‌ దగ్గర ఒక్కడే ఉండటాన్ని గమనించి ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. హత్య ఉదంతంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ప్రజానీకం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. సమాచారం తెలుసుకున్న సీఐ శివప్రసాద్‌ నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొన్నారు. రక్తపు మడుగులో పడిఉన్న నాగరాజును పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. నిందితుల కోసం  గాలించనప్పటికీ ఫలితం దక్కలేదు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నాలుగు నిమిషాల్లో 27 కత్తి పోట్లు
పక్కా పథకంతో రోడ్డుకు ఇరువైపులా నుంచి మారణాయుధాలతో వచ్చిన›పత్యర్థులు నాగరాజుపై అతి కిరాతకంగా దాడి చేశారు. మెడ, తల, శరీర భాగాల్లో బలంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  ప్రాణం విడిచాడని నిర్ధారించుకున్న తరువాతే  సంఘటన స్థలం నుంచి కదిలారు. ముస్లింల దుస్తుల్లో ఉన్న ముగ్గురు, మరో మైనర్‌ బాలుడు సంఘటనలో పాలుపంచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు.   సోమవారం మృత దేహాన్ని పోస్టుమార్టం చేసిన సమయంలో శరీరంపై ఉన్న 27కత్తిపోట్లు, వేళ్లు తెగిపడిఉంటాన్ని పోలీసులు గుర్తించారు.

ఇటీవల జైలు నుంచి విడుదల
మృతుడు నాగరాజు ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో మూడు నెలల కిందట జరిగిన పాల వ్యాపారి మాతంగి కన్న హత్య కేసులో నిందితుడిగా ఉండి గత మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో పాటు నాగరాజుపై రెండు హత్య, మూడు హత్యాయత్నం, మరో ఐదు దాడి, బెదిరింపుల కేసులు ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ కొట్టివేయగా ప్రస్తుతం పాల వ్యాపారి హత్య కేసు మాత్రమే పెండింగ్‌ ఉందని పోలీసులు చెబుతున్నారు.  ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో గతంలో జరిగిన రేషన్‌ డీలర్‌ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు. మృతుడి సోదరుడు నాగరాజును అంతమొందించేందుకు గతంలో రెండుసార్లు పథక రచన చేసి విఫలమయ్యాడు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు రాజీ పడటంతో కేసు గత ఆరునెలల కిందట కొట్టేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు నాగరాజును కిరాయి మనుషులతో హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు