వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి

26 Jan, 2019 10:33 IST|Sakshi
సంఘటన స్థలంలో పులి కళేబరాన్ని పరిశీలిస్తున్న రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, డీఎఫ్‌వో రామలింగం, మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు

మంచిర్యాలఅర్బన్‌(చెన్నూర్‌): జాతీయ జంతువు, అత్యంత అరుదైన జాతికి చెందిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి నేలకొరిగింది. మందమర్రిలో స్వాధీనం చేసుకున్న పులి చర్మానికి సంబంధించిన చిక్కుముడి వీడింది. చెన్నూర్‌ అటవీ డివిజన్‌ శివ్వారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన పులి అవశేషాల(కళేబరం)ను శుక్రవారం కనుగొన్నారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి మందమర్రి రామన్‌కాలనీలో గురువారం పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పులి చర్మం విక్రయించే ముఠాకు చెందిన పెద్దపల్లి జిల్లా రామరావుపేట్‌కు చెందిన నర్సయ్యతోపాటు ముగ్గురిని, చర్మం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల అటవీశాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.

శుక్రవారం పోలీసు టాస్క్‌పోర్సు, అటవీశాఖ అధికారులు శివ్వారం గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పులి మృతి విషయం వెలుగుచూసింది. పులి చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కళేబరం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. పక్షం రోజుల క్రితం అటవీ జంతువుల కోసం విద్యుత్‌ తీగలు అమర్చగా మరో వన్యప్రాణిని తరుముకుంటూ వచ్చి పులి విద్యుత్‌ షాక్‌తో మృతిచెందినట్లు నిందితుడు చెబుతున్నాడని అటవీ అధికారులు తెలిపారు. దుండగులు విలువైన పెద్దపులి చర్మాన్ని, గోళ్లను తీసుకుని అటవీ ప్రాంతంలో కళేబరాన్ని వదిలి వెళ్లారు. ఇదే కేసులో శివ్వారం గ్రామానికి చెందిన మల్లయ్య, బుచ్చిరాజయ్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన టాక్సీ డ్రైవర్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
పులి చనిపోయిన సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల్, అడిషనల్‌ డీసీపీ రవికుమార్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం, మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పదిహేను రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. నాలుగేళ్ల వయస్సు కలిగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశువైద్యులతో పులి కొంత భాగాన్ని కత్తిరించి పులికి సంబం«ధించిన పూర్తి వివరాల సేకరణకు ఫోరెనిక్స్‌ ల్యాబ్, సీసీఎంబీలకు పంపిస్తామని తెలిపారు. ఇంకా కేసుపై విచారణ సాగుతోందని, రెండు మూడు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు.

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్, అటవీశాఖ సంయుక్తంగా పెద్దపులి మరణంపై విచారణ చేపడుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అటవీ ప్రాంతంలో ఉందా లేదా అన్న అంశాలపై విచారణ చేపట్టి కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్ల వయస్సు గల పెద్దపులి 12నుంచి 13 ఫీట్ల పొడవు ఉందని, దీనికి మార్కెట్‌లో విలువ ఉంటుందని భావించిన దుండగులు చర్మం, గోళ్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్‌ ఉచ్చులతో చనిపోతే హత్య కేసులుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది దుండగులను గుర్తించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు