లోకోపైలెట్‌పై కేసు

13 Nov, 2019 07:53 IST|Sakshi
క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకో పైలట్‌ చంద్రశేఖర్‌

ఆర్‌పీఎఫ్‌ ఫిర్యాదు  

డ్రైవర్‌ పరిస్థితి విషమం  

పూర్తయిన పునరుద్ధరణ పనులు  

రైళ్ల రాకపోకలు యథాతథం  

పాక్షికంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులు  

తగ్గిన ప్రయాణికులు  

కాచిగూడ స్టేషన్‌లో సిగ్నల్‌ను గమనించకుండా వెళ్లి హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌ లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్‌పీఎఫ్‌ అధికారులు, కాచిగూడ స్టేషన్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కోలుకున్న తర్వాత అధికారులు వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై దక్షిణమధ్య రైల్వే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.    

 

రైళ్ల రాకపోకలు షురూ...
ప్రమాదం జరిగిన అనంతరం చేపట్టిన పునరుద్ధరణ పనులు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మొదట సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం సుమారు 2గంటలకు కాచిగూడ స్టేషన్‌ నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్లింది. తర్వాత పలు ప్యాసింజర్‌ రైళ్లు వెళ్లాయి. సాయంత్రం 7:05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన కాచిగూడ–మైసూర్‌ (12785) ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10:05 గంటలకు వెళ్లింది. అలాగే కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ (17603) ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9:05 గంటలకు బదులు రాత్రి 11:05 గంటలకు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్‌లో అన్ని ట్రాక్‌లకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోలకు మార్గం సుగమమైంది. ఇక ప్రమాద ఘటన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు పాక్షికంగా నడిచాయి. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు మాత్రమే రా>కపోకలు సాగించాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సాధారణ రోజుల్లో 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించకుంటుండగా... మంగళవారం 80వేల మంది వరకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సెలవు దినం కావడం కూడా ఇందుకు మరో కారణం.  

మరిన్ని వార్తలు