ఏడుస్తున్నాడని వెళితే.. ప్రాణం తీశాడు!

23 Aug, 2018 06:31 IST|Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న  చిన్నారి తల్లి పరమేశ్వరి, మృతి చెందిన చిన్నారి

నంద్యాల(కర్నూలు):  ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి ఆరు నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నవీన్‌బాబు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనపేటకు చెందిన పరమేశ్వరి, ఓబులయ్య కుమారుడు జగన్‌కు ఆరు నెలల వయసు. మంగళవారం రాత్రి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ పర్ల దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. కడుపునొప్పితో బాధపడుతున్నాడేమోనని, మందులు వాడితే తగ్గిపోతుందని భావించారు.

చిన్నారిని పరీక్షించిన ఆర్‌ఎంపీ సిరప్‌లు, మందులు రాసిచ్చాడు. అతను ఇచ్చిన సైక్లోఫాం డ్రాప్స్‌ చిన్నారి జగన్‌కు వేసిన ఐదు నిమిషాలకే శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయపడి పోయిన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఆర్‌ఎంపీ ఇచ్చిన మందులను పరిశీలిస్తే సైక్లోఫాం డ్రాప్స్‌ గడువు తేదీ (ఎక్స్‌పైర్‌ డేట్‌) 2016 నుంచి జూన్‌ 2018 వరకే ఉంది. చిన్నారికి తప్పుడు వైద్యం చేసి.. మరణానికి కారణమైన ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి పరమేశ్వరి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు