పార్శిల్‌లో రూ.15 లక్షల బంగారం

24 Nov, 2017 19:23 IST|Sakshi

సాక్షి, చెన్నై: దుబాయ్‌ నుంచి పార్శిల్‌లో అక్రమంగా వచ్చిన రూ.15 లక్షల విలువ గల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కం పన్నాట్టు తపాల కార్యాలయానికి దుబాయ్‌ నుంచి చెన్నై సమీపం కేళంబాక్కంలో ఉన్న మిన్‌హాజకి గురువారం ఓ పార్శిల్‌ వచ్చింది. అందులో ఉన్నవి ఇంటి అలంకారం వస్తువులని నమోదు చేసి ఉంది. ఆ పార్శిల్‌ను చూసి అనుమానం వచ్చిన తపాలాశాఖ సిబ్బంది ఇన్‌కంటాక్స్‌ అధికారులకు సమాచారం అందించారు.

తమ ఎదుట హాజరుకావాలని ఆ పార్శిల్‌లో ఉన్న అడ్రస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు లేఖ పంపారు. దీనికి ఎటువంటి స్పందనా రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్‌కంటాక్స్‌ అధికారులు పార్శిల్‌ను విప్పి చూశారు. అందులో బరువుగా ఉన్న జగ్గు ఉంది. పగులగొట్టి చూడగా చిన్న చిన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయి. రూ.15 లక్షలు విలువ గల ఒకటిన్నర కిలోల బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ఎవరి కోసం దుబాయ్‌ నుంచి వచ్చింది, పార్శిల్‌ అడ్రస్‌ సరైనదేనా అని అధికారులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు