ఏటీఎం వద్ద రూ.39 లక్షల చోరీ

10 Jun, 2020 04:23 IST|Sakshi
ఘటనా స్థలిని పరీశీలిస్తున్న పోలీసులు

ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి అపహరణ

గుంటూరు రూరల్‌: గుంటూరు అమరావతి రోడ్డులోని సెంట్రల్‌ బ్యాంక్‌ పక్కనున్న ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం నుంచి రూ.39 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మంగళవారం పట్టపగలు జరిగిన ఈ దొంగతనం సంచలనం కలిగించింది. గుంటూరులోని పలు ఏటీఎంలలో రైటర్స్‌ సేఫ్‌గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నగదు నింపుతుంది. మంగళవారం ఆ సంస్థకు చెందిన నాగేంద్ర, ప్రవీణ్‌లతో పాటు గన్‌మేన్‌ బ్రోజారావు, డ్రైవర్‌ తిరుపతిరావు వాహనంలో ఏటీఎం వద్దకు వచ్చారు. నగదును వాహనంలోనే ఉంచి ప్రవీణ్, నాగేంద్ర, బ్రోజారావు బ్యాంక్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చేసరికి వాహనంలో రూ.39 లక్షలున్న నగదు పెట్టె కనిపించలేదు. దీంతో సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులకు సమాచారం అందటంతో వచ్చిన గోరంట్ల సీఐ వీరాస్వామి వాహనంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అర్బన్‌ సీసీఎస్‌ ఏఎస్పీ మనోహరరావు, డీఎస్పీలు కమలాకర్, రామారావు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. గన్‌మెన్, మరొకరు బ్యాంకులోకి వెళ్లగా ఒకరు ఏటీఎం వద్ద ఉన్నామని, డ్రైవర్‌ టీ తాగేందుకు టీ స్టాల్‌ వద్దకు వెళ్లారని వారు చెప్పారని తెలిసింది. వాహనాన్ని ఏటీఎం వరకు తీసుకురాకపోవడంతో అసలు నగదు పెట్టె వాహనంలో తెచ్చారా లేదా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు లేనిదే మోయలేని పెట్టెను స్థానికంగా ఉండే సీసీ కెమెరాల కంట్లో పడకుండా మాయం కావడంతో ఇది ఇంటి దొంగల పనేనా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు