రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

24 Sep, 2019 08:43 IST|Sakshi

ఎల్‌టీటీ స్టేషన్లో ఘటన.. 

రూ.44 లక్షలు అపహరణ

సాక్షి, ముంబై: నిత్యం రద్దీగా ఉండే లోకమాన్య తిలక్‌ (కుర్లా) టెర్మినస్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది. సోమవారం తెల్లవారు జాము నాలుగైదు గంటల ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుకింగ్‌ కౌంటర్‌ కార్యాలయంలోని తిజోరీలో నిల్వచేసిన  రూ.44 లక్షలు చోరీకి గురైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కుర్లా టెర్మినస్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ల సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌ టీం వివరాలు సేకరిస్తోంది. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు బుకింగ్‌ కౌంటర్‌ సిబ్బందిని విచారిస్తున్నారు. 24 గంటలు ప్రయాణికుల రాకపోకలతో బిజీగా ఉండే ఈ స్టేషన్‌లో తిజోరీలో భద్రపర్చిన నగదు చోరీ కావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.   

సాంకేతిక లోపంతో నిలిచిన మోనో.. 
సాంకేతిక లోపంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సోమవారం ఉదయం మోనో రైలు సేవలు స్తంభించిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చెంబూర్‌ పరిసరాల్లోని వాషినాకా–భారత్‌ పెట్రోలియం స్టేషన్ల మధ్య మోనో రైలు నిలిచిపోయింది. మార్గమధ్యలో రైలు నిలిచిపోవడంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులు కొద్ది సేపు గందర గోళానికి గురయ్యారు. మోనో రైలు మార్గం పైనుంచి వెళ్లడంతో డోర్లు తీసుకుని కిందికి దిగడానికి వీలులేకుండా పోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌ల నిచ్చెనల సాయంతో రైలులో చిక్కుకున్న ప్రయాణికులందరిని సురక్షితంగా కిందికి దింపారు.  రైళ్ల రాకపోకలు స్థంభించిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

>
మరిన్ని వార్తలు