పల్లీల్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ..

12 Feb, 2020 15:25 IST|Sakshi

సాక్షి, న‍్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్‌ యాన్‌ ఐడియా’  అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే... ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్‌ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్‌ పాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు.

వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్‌ పాకెట్‌లో ప్రతి బిస్కెట్‌ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్‌ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్‌ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అయితే మురాద్‌ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మురాద్‌ను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు