బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల మళ్లింపు

17 May, 2018 11:17 IST|Sakshi
బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తున్న రమణమ్మ

హిరమండలం స్టేట్‌బ్యాంకులో మహిళను బురిడీ కొట్టించిన మెసెంజర్‌

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సొమ్ము రికవరీ చేయించిన బ్యాంకు మేనేజర్‌

హిరమండలం : ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మెసెంజర్‌ డబ్బులు కాజేసిన ఘటన హిరమండలం ఎస్‌బీఐలో చోటుచేసుకుంది. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాడలి నిర్వాసిత గ్రామానికి చెందిన నల్ల రమణమ్మకు హిరమండలం ఎస్‌బీఐలో ఖాతా ఉంది. నిర్వాసితురాలు కావడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం అంతా ఖాతాలోనే ఉంది.

ఏప్రిల్‌ నాటికి ఆమె ఖాతాలో రూ.3.60 లక్షలు ఉండేది. గృహనిర్మాణ అవసరాల నిమిత్తం ఆమె ఏప్రిల్‌ 18న బ్యాంకుకు వెళ్లగా నగదు కొరత దృష్ట్యా రూ.20వేలకు మించి ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఖాతాల్లో సొమ్ములున్నా తీసుకోలేని పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా రూ.50వేలు ఇవ్వడానికి బ్యాంకు సిబ్బంది ఒప్పుకున్నారు. అప్పటికే చలానా నింపడాన్ని గమనించిన మెసేంజర్‌ బాలరాజు రూ.50వేలు తీసుకునేందుకు కొత్త చలానా (విత్‌డ్రా ఫామ్‌) నింపి నగదు ఇప్పించాడు.

ఆమె దగ్గర ఉన్న పాత రూ.20 వేల చలానా తీసుకున్నాడు. అందులో ఓ సున్నా అదనంగా వేసి రెండు లక్షల రూపాయలుగా మార్చి సొమ్మును తన ఖాతాలోకి మళ్లించాడు. ఏప్రిల్‌ నుంచి నగదు అవసరాలు లేకపోవడంతో రమణమ్మ బ్యాంకుకు రాలేదు. బుధవారం ఇంటి పనుల కోసం నగదు అవసరం పడటంతో ఖాతా పుస్తకంతో బ్యాంకుకు చేరుకుంది.

ఖాతాలో నగదు పరిశీలించగా రూ.2లక్షలు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురై బ్యాంకు మేనేజర్‌ దివాకర్‌కు ఫిర్యాదు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరపగా బాలరాజు ఖాతాకు మళ్లించినట్లు తేలింది. వెంటనే మేనేజర్‌ అతన్ని పిలిపించి మందలించారు. ఆయన ఖాతా నుంచి తిరిగి రమణమ్మ ఖాతాకు రూ.2లక్షలు జమచేశారు. ఇకపై ఇటువంటి తప్పిదాలు లేకుండా చూసుకుంటామని  బ్యాంకు మేనేజర్‌ తెలిపారు.

ఖాతాదారుల్లో ఆందోళన

హిరమండలం ఎస్‌బీఐ పరిధిలో ఎల్‌ఎన్‌పేట, హిరమండలం మండలాల్లో వేలాది మంది ఖాతాదారులు ఉన్నారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు కోట్లాది రూపాయలు మంజూరు చేశారు. ఈ లావాదేవీల ప్రక్రియతో స్థానిక ఎస్‌బీఐ నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటన వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.  

>
మరిన్ని వార్తలు