తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య

10 Oct, 2019 16:58 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఓ స్కూలు టీచర్‌ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. వివరాలు.. ముర్షీదాబాద్‌ జిల్లాకు చెందిన బంధు ప్రకాశ్‌ పాల్‌(35) అనే వ్యక్తి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య(ప్రస్తుతం గర్భిణి), ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ ముగ్గురు వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్న వీరిని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

కాగా ప్రకాశ్‌ ఆరెస్సెస్‌ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పశ్చిమ బెంగాల్‌ ఆరెస్సెస్‌ కార్యదర్శి మాట్లాడుతూ... గోపాల్‌ ఇటీవల కొన్ని రోజులుగా తాము నిర్వహించే  ‘వీక్లీ మిలన్‌(వారాంతపు సమావేశం)’లో పాల్గొంటున్నాడని తెలిపారు. ఇక ఈ పాశవిక హత్యపై బీజేపీ నేత సంబిత్‌ పాత్రా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన పాల్‌, ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆయన భార్య, వారి కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. కానీ లిబరల్స్‌ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆ 59 మంది మమతా బెనర్జీకి ఎందుకు లేఖ రాయడం లేదు అంటూ దేశంలో అసహనం పెరిగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ప్రముఖులను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక గోపాల్‌ కుటుంబం హత్యకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతీ ఒక్కరూ వారి శాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అదే విధంగా హంతకులను త్వరగా అరెస్టు చేసి, వారికి తగిన శిక్ష విధించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక పాల్‌ కుటుంబం హత్యకు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు