ఘొల్లుమన్న కొడిమ్యాల

6 Oct, 2018 03:21 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల.. మరోసారి ఘొల్లుమంది. మండలానికి చెందిన 53 మందిని పొట్టన పెట్టుకున్న కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగి నేటికి 25 రోజులు. ఇప్ప టికీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం అందలేదు. విడతల వారీగా కొనసాగుతున్న వివిధ శాఖల విచారణలతో విసిగెత్తిపోయిన మృతుల కుటుంబాలు పరిహారం కోసం శుక్రవారం రోడ్డెక్కాయి. ఆర్డీవో విచారణ కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన తమను సదరు అధికారి అవమానించారంటూ ఆందోళనకు దిగారు. రెండున్నర గంటలు  జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేశారు. జగిత్యాల పట్టణ సీఐ ప్రకాశ్‌ వారికి నచ్చజెప్పేందుకు ప్రయ త్నించినా ఫలితం లేకుండాపోయింది. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం వచ్చి వారిని శాంతింపజేశారు.  

విచారణ తీరుపై ఆగ్రహం
ఆర్డీవో గంటా నరేందర్‌ మహిళలను ఒక్కొక్కరిగా విచారిస్తుండటంతో కాస్త ఆలస్యం జరిగింది. ఇలా ఎందుకు విచారణ చేపడుతున్నారంటూ మృతుల కుటుంబీకులు అక్కడున్న ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బయటికి వచ్చిన ఆర్డీవో.. విచారణ అంటే ఇలానే ఉంటుందన్నారు. ఆర్డీవో తీరుపై మండిపడ్డ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో అనుచిత ప్రవర్తనపై ఆందోళనకు దిగారు.  

ఎవరినీ అవమానించలేదు: ఆర్డీఓ  
నేను ఒక్కొక్కరిని విచారిస్తుంటే ఆలస్యం జరిగింది. మృతుల కుటుంబీకులు తప్పుగా అర్థం చేసుకుని ఆందోళనకు దిగారు. విచారణ ఇలానే ఉంటుందని చెప్పాను తప్ప ఎవరినీ అవమానించలేదు.

మరిన్ని వార్తలు