ఆర్టీసీ బస్సు బోల్తా

3 May, 2019 10:26 IST|Sakshi
బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు, చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

10 మందికి గాయాలు

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రివర్స్‌ రావడం వల్లే ప్రమాదం  

అనంతపురం,శింగనమల/గార్లదిన్నె: గార్లదిన్నె సమీపం లో 44వ జాతీయ రహదారిపై కర్పూరం ఫ్యాక్టరీ వద్ద  గురువారం ఆర్టీసీ అద్దె బస్సు బోల్తా పడి ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఉదయం 11.20 గంటల సమయంలో 53 మంది ప్రయాణికులతో అనంతపురం బయలుదేరింది. బస్సు కర్పూరం ఫ్యాక్టరీ వద్దకు రాగానే హైవే పెట్రోలింగ్‌ పోలీస్‌ వాహనం యూ టర్న్‌ తీసుకుని గార్లదిన్నె వైపునకు మళ్లింది. అయితే అటువైపు మరో వాహనం రావడంతో ఒక్కసారిగా వెనక్కువచ్చింది. బస్సు డ్రైవర్‌ రాఘవ గమనించి గందరగోళంలో సడన్‌ బ్రేక్‌ వేసి ఎడమ వైపునకు యూటర్న్‌ చేశాడు. దీంతో  ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది.

వెంటనే బస్సు డ్రైవర్‌ సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్‌ ఎస్‌ఎస్‌ వలి,బస్సు అద్దాలు పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురానికి చెందిన రత్నమ్మ, సుధీర్, గుత్తికి చెందిన పద్మావతి, కృష్ణ, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ శైలజతోపాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గార్లదిన్నె ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీస్‌ సిబ్బందితో  సంఘటన స్థలం వద్దకు చేరుకొని, మరికొంత మంది క్షతగాత్రులను మరో 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.  

 సమాధులతో దక్కిన ప్రాణాలు  
ఆర్టీసీ బస్సు గుంతలోకి బోల్తా పడినప్పుడు అక్కడున్న రెండు సమాధులను ఢీకొంది. దీంతో బస్సు మరోసారి పల్టీ కొట్టకుండా ఆగిపోయింది. సమాధులు లేకుంటే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని స్థానికులు, ప్రయాణికులు చర్చించుకోవడం కనిపించింది.

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ పీఎన్‌ బాబు సంఘటన స్థలం పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.

మరిన్ని వార్తలు