కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

1 Sep, 2019 09:20 IST|Sakshi
ఘటన స్థలంలో డ్రైవర్‌ నానిబాబును విచారిస్తున్న సీఐ సత్యనారాయణ 

సాక్షి, పెనమలూరు(కృష్ణా) : ఆర్టీసీ బస్సు కరకట్టపై పల్టీ కొట్టి 15 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన మండలంలోని చోడవరం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ నుంచి అవనిగడ్డకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరింది. కరకట్టపై పెదపులిపాక– చోడవరం గ్రామాల మధ్యలో ఉన్న ఉండరపు కట్ట వద్దకు చేరింది. అక్కడ రోడ్డుపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ను బస్సు డ్రైవర్‌ కాసాని నానిబాబు గమనించకుండా బస్సును వేగంగా దూకించాడు. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి కుడివైపు కట్ట దిగువకు పల్టీ కొట్టింది. అయితే చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఎడమ వైపుకు పల్టీ కొట్టి ఉంటే కేఈబీ కెనాల్‌లోకి పడి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటన వద్ద..
బస్సు ఒక్కసారిగా కరకట్ట దిగువకు పల్టీ కొట్టడంతో భయాందోళణకు గురైన ప్రయాణికుల ఆరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్‌ కేఎస్‌హెచ్‌ బాబు తెలిపారు. బస్సు పడిపోవటంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో బస్సులో తొక్కిసిలాటలో 15 మందికి గాయపడ్డారు. గాయపడిన వారిలో కోడూరుకు చెందిన అన్నంరమేష్‌ (16), అన్నంఓంకార్‌(17), చాగంటాపాడుకు చెందిన దేవరకొండ గోపీకృష్ణ(24), అవనిగడ్డకు చెందిన శివపార్వతి(50), మోపిదేవికి చెందిన మత్తి శివనాగబాబు(23), కలపాల రజిత్‌కుమార్‌(18), కలపాల రజిత(19), రామానగరానికి చెందిన  కొత్తపల్లి భుజంగరావు(64), కాసాని సాంబశివరావు(64), కాసానివెంకటరామమూర్తి(24), విజయవాడకు చెందిన గొలికొండ మహేష్, ముబారక్‌హుస్సేన్, నాగాయలంకకు చెందిన వెంకటశివనాగరాజు, చల్లపల్లికి చెందిన శివనాగమణి, కాసరనేనివారిపాలేనికి చెందిన బి.రత్నంరాజు గాయపడ్డారు. గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పది మందిని తరలించగా, 108 వాహనం సిబ్బంది మిగితా వారికి చికిత్స చేశారు. బస్సులో ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.

ఇంత నిర్లక్ష్యమా...
ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపగా, సామర్థ్యానికి మించి 70 మంది ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పిందని,లేక పోతే భారీగా ప్రాణనష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఘటనా స్థలం వద్ద ఎమ్మెల్యేలు..
ఘటనా స్థలం వద్దకు తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ చేరుకున్నారు. ఆ తరువాత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వచ్చారు. వారు ప్రయాణికులను పరామర్శించారు. జరిగిన ఘటన పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి వైద్యం అందించాలని అధికారులను కోరారు.   

మరిన్ని వార్తలు