మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

24 Nov, 2018 08:48 IST|Sakshi
మృతుడు నాగేశ్వరరావు మృతికి కారణమని చేతిపై రాసిన దృశ్యం

తన చావుకు డీఎం దివ్య కారణమంటూ చేతిపై రాత

జేబులో సూసైడ్‌ నోట్‌

మృతికి కారణమైన వారిని శిక్షించాలని కేజీహెచ్‌ వద్ద బంధువుల ఆందోళన

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సింహాచలం ఆర్టీసీ డిపోలో ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాద సంఘటనపై డిపో మేనేజర్‌ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్‌ పురుగుల మందు తాగి  ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. తీవ్ర ఆందోళన రేపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... ఇక్కడి డిపోలో 1991 నుంచి చింతా నాగేశ్వరరావు(55) డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెల 21న 55వ నంబరు బస్సు నడుపుతుండగా ఎన్‌ఏడీ కూడలిలో ఓ కారు తగిలింది. దీంతో కారు డ్రైవింగ్‌ చేసిన యజమానికి, నరసింగరావుకి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కారు డ్రైవర్‌ తప్పిదమో, నరసింగరావు పొరపాటో తెలీదు.

అయితే తన తండ్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వద్ద అసిస్టెంట్‌ ట్రాపిక్‌ మేనేజర్‌ అని చెప్పి సదరు కారు యజమాని హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం ఫిర్యాదు చేయడంతో రీజినల్‌ మేనేజర్, ఉన్నతాధికారుల నుంచి ఆరా తీయడంతో డీఎం దివ్య శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగేశ్వరరావుని ప్రశ్నించారు. కారు ఓనర్‌తో వివాదాన్ని సెటిల్‌ చేసుకోవాలని చెప్పడంతో తాను తప్పు చేయలేదని నాగేశ్వరరావు చెప్పినట్లు సమాచారం. డీఎం విచారణ తర్వాత కొద్ది సేపటికి బయటకు వెళ్లిన నాగేశ్వరరావు నురగలు కక్కుతూ తిరిగి వచ్చి నేను చనిపోతున్నానంటూ అక్కడ కనిపించిన కార్మికులకు ఆందోళనగా చెప్పారు. అనంతరం డిపోలో ఉన్న గుడి వద్ద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగం సిబ్బంది హుటాహుటిన నాగేశ్వరరావు వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడి జేబులో లభించిన సూసైడ్‌ నోట్‌ను చదివి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తన  అర చేతిమీద తన మరణానికి ఎవరు కారణం అన్న విషయాన్ని స్పష్టంగా రాసుకున్నాడు.

అపస్మారక స్థితిలో ఉన్న నాగేశ్వరరావును తొలుత గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కి తరలించారు. ఇంతలోనే నాగేశ్వరరావు ప్రాణం వదిలేశారని వైద్యులు వెల్లడించారు. జరిగిన సంఘటనపై గోపాలపట్నం ఎస్‌ఐ తమ్మినాయుడు విచారణ చేపట్టారు. చెదల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మరోవైపు తమ తోటి ఉద్యోగి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆర్టీసీ కార్మికులు,  మృతుని బంధువులు శుక్రవారం రాత్రి కేజీహెచ్‌ ఓపీ గేట్‌ వద్ద నిరసన చేపట్టారు.  

నా చావుకు డీఎం దివ్య కారణం
ఆత్మహత్యకు ముందు నాగేశ్వరరావు తన చేతిపై... తన చావుకి డీఎం కారణం... ఆమె వేధింపుల వల్లే చనిపోతున్నా... అని రాసుకున్నాడు. జేబులో సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ విచారణకు సంబంధించి ఈడీ పేషీలో సత్యనారాయణకు సంబంధించిన వివాదంగా రాసి ఉంది. ఇలా రాసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా జరిగిన సంఘటనపై కార్మికులు ఆందోళన వెలిబుచ్చారు. చిన్నపాటి సంఘటనలపైనా ఆర్టీసీ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. సంఘటనను, సమస్యను విచారించకుండా డ్రైవర్లపైనే నిందలేసి శిక్షిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు.

యల్లపువానిపాలెంలో విషాదం
నాగేశ్వరరావు మృతితో యల్లపువానిపాలెం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సున్నిత మనస్కుడైన నాగేశ్వరరావు కార్మికులకు ఏ ఆపదొచ్చినా తాను ముందుకెళ్లి స్పందించే వారు. ఇలా శుక్రవారం మధ్యాహ్నం విచారణకు ముందు కూడా కార్మికుల సమస్యలపై డిపో గేటు వద్ద ఎన్‌ఎంయూ జెండా పట్టుకుని ధర్నా చేశారు. ఇంతలోనే ఇలా జరగడంపై కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నాగేశ్వరరావు భార్య అమ్మాజీకి గుండె సమస్య ఉండడంతో ఆయన మరణ వార్తను శుక్రవారం రాత్రయినా తెలియనీయలేదు. పోలీసులు కేవలం నాగేశ్వరరావు కొడుకులకే చెప్పారు. తన భర్త వస్తారనే అమ్మాజీ ఎదురు చూస్తుండడం స్ధానికులను కలచివేసింది.

స్టేట్‌మెంట్‌ మాత్రమే కోరాను
నాగేశ్వరరావు మరణం బాధాకరం. ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపాన బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో కారు యజమాని ఆర్టీసీ ఆన్‌లైన్‌లో సెంట్రల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏం జరిగిందో నాగేశ్వరరావుని స్టేట్‌మెంట్‌ మాత్రమే అడిగాను. కారుకి తన బస్సు తగల్లేదని నాగేశ్వరరావు చెప్పాడు. అదే విషయాన్ని రాసివ్వాలని సూచించాను. ఆ సమయంలో నాగేశ్వరరావుతో పాటు కార్మికులు కూడా ఉన్నారు. అనంతరం బయటకు వెళ్లిపోయాక ఆత్మహత్యకు పాల్పడ్డారు.– దివ్య, డిపో మేనేజర్‌

డిపో మేనేజర్‌ వేధింపులే కారణం
డ్రైవర్‌ నాగేశ్వరరావు బలవన్మరణానికి డిపో మేనేజర్‌ హరిదాసుల దివ్య వైఖరే కారణం. ఆమె పెడుతున్న క్షోభ, మానసిక హింస వల్లే చనిపోయాడు. దళితుడైన నాగేశ్వరరావును అందరి ఎదుట పలుమార్లు కులం పేరిట దివ్య దూషించిన సందర్భాలున్నాయి. ఆమెపై గతంలో గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లోను, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు చర్యలు  చేపట్టలేదు. నాగేశ్వరరావు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.– ఎస్‌.పి.సిహెచ్‌.దత్, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు