ఒక్కసారి లేవండి...పిల్లల్ని చూడండి

22 Mar, 2018 07:29 IST|Sakshi
భర్త తాజ్‌బాబు మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, పిల్లలు

శోకసంద్రంలో ఆర్టీసీ డ్రైవర్‌ సయ్యద్‌ తాజ్‌బాబు భార్య

తమకు దిక్కెవరంటూ గుండెలు పగిలేలా రోదన

ముగ్గురు కుమార్తెలతో కలసి కన్నీరుమున్నీరు

ఆర్టీసీ డ్రైవర్‌ తాజ్‌బాబు మృతితో  పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం

కారంపూడి: ఆజీ.. ఏక్‌ బార్‌ దేఖో జీ... హుటో జీ.. బచ్చీ ఆయే...అంటూ గుండెపోటుతో  విధి నిర్వహణలో బుధవారం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సయ్యద్‌ తాజ్‌బాబు భార్య కైరున్‌ శోకమిది. ఒక్కసారి లేవండి... ఒక్క సారి చూడండి.. పిల్లల్ని చూడండి అంటూ ఆమె రోదన హృదయాన్ని పిండేసింది. ఎలాంటి అలవాట్లు లేవయ్యా...నిన్న విజయవాడ వెళ్లినప్పుడు ఫోన్‌ చేశా...ట్రాఫిక్‌లో ఉన్నాను, మళ్లీ ఫోన్‌ చేస్తానన్నాడు. తర్వాత చేశారు. రాత్రి ఇంటికి వచ్చి,  మళ్లీ  ఉదయాన్నే డ్యూటీకి వెళ్లాడు. ఇంతలోనే చావు కబురు వచ్చిందని విలపించింది. కుమార్తెలు షమీనా, షారీనా, అమీనాలు కూడా తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు కలచివేస్తోంది.

డ్రైవింగ్‌ చేస్తుండగానే గుండెపోటు
పిడుగురాళ్ల నుంచి కారంపూడి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సయ్యద్‌ తాజ్‌బాబుకు మార్గం మధ్యలో జూలకల్లు గ్రామం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో స్టీరింగ్‌ పైనే వాలిపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును చెట్టును ఢీకొంది. డ్రైవర్‌ తాజ్‌బాబు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల్లో  13 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులకు ఆర్డీవో పరామర్శ
కారంపూడిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని గురజాల ఆర్డీవో మురళి పరామర్శించారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ హనుమంతరావు, ఎస్‌ఐ మురళీలు, ఆర్టీసీ అధికారులు, సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. తాజ్‌బాబు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం గురజాల తరలించారు. నోటి భాగంలో తీవ్ర గాయం కావడంతో కారంపూడి తహసీల్దార్‌ గుంటూరు ఆసుపత్రిలో చేరారు. ఆర్టీసీ ఎస్టీవో నర్సరావుపేటలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్‌బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

డ్రైవర్‌ సమయస్ఫూర్తి వల్లే పెను ప్రమాదం తప్పింది
గుండెపోటు వచ్చినప్పుడు బ్రేక్‌ వేద్దామన్నా సాధ్యం కాదని, డ్రైవర్‌ సమయస్ఫూర్తితో స్టీరింగ్‌ తిప్పబట్టి చెట్టుకు ఢీకొని బస్సు ఆగిందని డీఎస్పీ ప్రసాద్‌ అన్నారు. డ్రైవర్‌ తాను చనిపోతూ బస్సులో ఉన్న 22 మందికి  ప్రాణాపాయం లేకుండా చేశారని, లేకపోతే ముందే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు.

గాయపడిన వారి వివరాలు
కారంపూడి తహసీల్దార్‌ సాయిప్రసాద్, ఆర్టీసీ బస్సు కండక్టర్‌ రాంబాబు, కారంపూడి ఏఎన్‌ఎం రమాదేవి, పిడుగురాళ్లకు చెందిన కార్మికులు వెంకటేశ్వర్లు, శ్రీను, యాకోబు, సునీల్, యర్రెయ్య, చిన్నమ్మ, సీతమ్మ మరో ఇద్దరు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్‌బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు