ఆర్టీసీ బస్సు ఢీ.. డ్రైవర్‌ దుర్మరణం

11 Jun, 2019 13:38 IST|Sakshi
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ నర్సింహారావు

బస్సు ట్రయల్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదం

యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ఘటన 

రోజూ మాదిరిగానే ఇద్దరు కూతుళ్లకు టాటా చెప్పి విధులకు బయలుదేరిన ఆ తండ్రి అనుకోలేదు.. కాసేపట్లో మృత్యువు కబళిస్తుందని.. ఓ ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి.. మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆయువు అర్ధంతరంగా ముగిసిపోయింది. యాదగిరిగుట్ట డిపోలో సోమవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. దీంతో రాజాపేట మండల పరిధిలో విషాదం అలుముకుంది. 
సాక్షి, యదగిరిగుట్ట (ఆలేరు): రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ గోపగాని నరేష్‌ గౌడ్‌ (33) యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించేందుకు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఆర్టీసీ బస్టేషన్‌లోని గ్యారేజీలోకి చేరుకున్నాడు. సుమారు ఉదయం 7.30గంటల ప్రాంతంలో గ్యారేజీలోని డీజిల్‌బంక్‌ వద్దకు వెళ్లి, అక్కడ లాక్‌షీట్‌ తీసుకుని, కేఎంపీఎల్‌ రాసుకుంటు వస్తున్నాడు.

ఇదే క్రమంలో ఏపీ 29 జెడ్‌ 1871 ఎక్స్‌ప్రెస్‌ బస్సును డ్రైవర్‌ బి.కిష్టయ్య తీసుకెళ్లెందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే బ్రేక్‌ చెకింగ్‌ చేసుకుంటూ ట్రయల్‌ నిర్వహిస్తున్నాడు. అప్పటికే డీజిల్‌ బంక్‌ దాటి ముం దుకు వచ్చిన గోపగాని నరేష్‌ను ట్రయల్‌ వేస్తున్న బస్సు రైట్‌ సైడ్‌ నుంచి ఢీ కొట్టింది. దీంతో వెంటనే నరేష్‌ కిందపడిపోవడంతో వెనుక టైర్‌ ఆయన మీదికి ఎక్కింది. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే నరేష్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోకి వెళ్లగానే నరేష్‌ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ
ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీలో జరిగిన ప్రమాదస్థలాన్ని యాదగిరిగుట్ట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు సందర్శించారు. ప్రమాదానికి గల వివరాలు అక్కడ ఉన్న కార్మికులకు, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

కాలికి గాయమైందని చెప్పారు...
డిపో గ్యారేజీలో ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢీ కొట్టిన మాట వాస్తమేనని, ఆయనకు ఎలాంటి ప్రాణహానీ లేదని, కాలికి మాత్రమే గాయమైందని ఆర్టీసీ అధికారులు తమకు చెప్పారని కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లి చూస్తే నరేష్‌ విగత జీవిగా కనిపించారని కన్నీరుమున్నీరయ్యారు. డ్యూటీ నుంచి సాయంత్రం వస్తానని, పిల్లలు జాగ్రత్తా అంటూ భార్యకు నరేష్‌ చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో నరేష్‌ను పొట్టనపెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు