డ్రైవరు బలవన్మరణం కేసు దర్యాప్తు ఇలాగేనా?

25 Dec, 2018 12:48 IST|Sakshi
సుధేష్‌కుమార్‌తో చర్చిస్తున్న రాములు

మరణ వాంగ్మూలం రాసినా డీఎంపై చర్యలుండవా?

ఆర్టీసీ ఆర్‌ఎంను ప్రశ్నించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు

విశాఖపట్నం, గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): డిపో మేనేజర్‌ దివ్య వేధింపుల వల్లే చనిపోతున్నానని రాతపూర్వక వాం గ్మూలం ఇచ్చి సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో డ్రైవరు చింతా నాగేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడితే ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, అటు పోలీసులూ స్పందించే తీరు ఇలాగేనా అంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు మండిపడ్డారు. చిన్నపాటి తప్పులకే అరెస్టులు, సస్పెన్షన్లు చేసే అధికారులు ఇంత అఘాయిత్యం జరిగితే దర్యాప్తు ఏం చేశారని ప్రశ్నించారు. నాగేశ్వరరావు ఆత్మహత్యా సంఘటన నేపథ్యంలో ఆయన దళిత నాయకులతో కలిసి డిపోకు వచ్చారు. దీంతో ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుధేష్‌కుమార్, సీఐ పైడియ్య కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో రాములు చర్చించారు. డ్రైవరు నాగేశ్వరరావుపై డీఎం దివ్య విధి నిర్వహణలో ఒత్తిడి, వేధింపులకు పాల్పడడం వల్లే మరణించినట్లు తెలుస్తోందని ఆరోపించారు.

సంఘటన జరిగి నెల రోజులవుతున్నా ఆర్టీసీ అధి కారులు, పోలీసులు శాఖాపరంగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం అన్యాయమన్నారు. చిన్నపా టి తప్పిదానికే డ్రైవర్లు, కండక్టర్లను సస్పెండ్‌ చేసే అధికారులు.. దివ్య విషయంలో అలా స్పందించకపోవడమేంటని ప్రశ్నిం చారు. తన చావుకి కారణం డీఎం అని చేతిపై రాసుకుని చనిపోతే దివ్యను అరెస్టు చేయకపోవడమేంటని సీఐను ప్రశ్నించారు. దీనిపై సీఐ వివరణ ఇస్తూ.. ఈ కేసు దర్యాప్తు ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌ చేపడుతున్నారన్నా రు. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను రాములు ఫోన్‌లో ఆరా తీశారు. దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వివరణ ఇచ్చారు. శాఖాపరంగా తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని సుధేష్‌కుమార్‌ వివరించారు. నాగేశ్వరరావు కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వడానికి తాను హామీ ఇచ్చానని, దీనికి సంబంధించి సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. దర్యాప్తు విషయంలో జాప్యం చేస్తే పరిణా మాలు తీవ్రంగా ఉంటాయని రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ, దళిత సంఘాల నాయకుడు బూసి వెంకటరావు, డిపో ఎస్సీ ఎస్‌టీ నాయకులు టీఎన్‌ రావు, బీవై రత్నం, బీఎస్‌ నారాయణ, డీకే రాజు, బీఏ రావు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం దారుణం
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): పెదగంట్యాడ ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి 19 రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ధ్వంసమైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు నిరసనగా వివిధ సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సైతం కలెక్టర్, ఆర్‌డీవో, పోలీస్‌ కమిషనర్, డీజీపీ కానీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళితులంటే అంత చులకనా అని ప్రశ్నించారు. 24 గంటల్లోపు ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్, సీపీ ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తరువాత రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.అప్పలరాజు, బాబూరావు, రోజారాణి, వనజాక్షి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు