పీఎస్‌లో లొంగిపోయిన డీఎస్పీ రవిబాబు

21 Oct, 2017 03:47 IST|Sakshi

సాక్షి, విశాఖ : రౌడీ షీటర్‌ గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ రవిబాబు ఎట్టకేలకు  గురువారం తెల్లవారుజామున చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి.

అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు