ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్య

19 Jun, 2018 19:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మోతిహరి(బిహార్‌) : ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. తూర్పు చంపారన్‌లోని మత్‌బన్వారీ చౌక్‌ సమీపంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన రాజేంద్ర సింగ్‌పై శత్రువులు ఇప్పటికే మూడుసార్లు దాడి చేశారు. ఈ విషయమై తనకు భద్రత పెంచాల్సిందిగా రాజేంద్ర సింగ్‌ పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు వి​​​​​​​ఙ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ ప్రాసెసింగ్‌లో ఉండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు...
నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శించింది. రాజేంద్ర సింగ్‌ హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్‌ చేసింది. ఎన్డీయే కూటమి- నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లు అర్థాంతరంగా తనువు చాలించాల్సి వస్తోందని ఆర్జేడీ సీనియర్‌ నేత అలోక్‌ మెహతా ఆరోపించారు. 

కాగా పోలీసు, ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, గృహ, మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి పలు అంశాల గురించి ఎన్నో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో రాజేంద్ర సింగ్‌ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన వెలుగులోకి తెచ్చిన కుంభకోణాలకు సంబంధించిన పలు కేసులు ప్రస్తుతం విచారణకు వచ్చిన నేపథ్యంలో హత్యకు గురికావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు