ఒక కాలు.. ఎన్నో ప్రశ్నలు.. 

7 Feb, 2018 12:16 IST|Sakshi

అదెవరిది..? అసలేమైంది..? హత్యా..? ప్రమాదమా..? తెలిసేదెలా..?

పాల్వంచరూరల్‌:  అది. పాల్వంచలోని కేటీపీఎస్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌. అక్కడొక కన్వేయర్‌ బెల్ట్‌. కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం బి–స్టేషన్‌కు చెందినది. కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ) నుంచి 34ఏ మీదుగా 5–ఏకు బొగ్గును సరఫరా చేస్తోంది. అక్కడ మంగళవారం ఉదయం సిబ్బంది విధుల్లో ఉన్నారు. బంకర్‌లో నిలిచిపోయిన బొగ్గు చూరను తొలగిస్తున్నారు. 

ఆ చూరలో వారికి ఒకటి కనిపించింది. దానిని చూడగానే భయమేసింది. కొన్ని క్షణాల పాటు వణికిపోయారు. అదేమిటో తెలుసా..? కాలు..! మనిషి కాలు..!! నుజ్జు నుజ్జయింది. కాలు ఒక్కటే ఉంది. ఎవరిదిది..? ఎలా వచ్చింది..? ఏం జరిగింది..? అక్కడి సిబ్బందిలో అనేక సందేహాలు. సైదులు అనే కార్మికుడొకరు వెంటనే సంబంధిత షిఫ్ట్‌ ఇంజనీర్లకు సమాచారమిచ్చారు. 

అధికారులు వచ్చారు.. చూశారు. ఎస్సై రవికుమార్‌ చేరుకున్నారు, ఆ కాలును ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతోనే అక్కడకు కేటీపీఎస్‌ ఇన్‌చార్జ్‌ సీఈ నర్సింహం, సీఈ సమ్మయ్య, ఎస్‌ఈలు, ఏడీలు, డీఈలు, కార్మికులు పెద్ద సంఖ్య లో చేరుకున్నారు. వారందరి సమక్షంలో సిబ్బంది ఇంకా సూక్ష్మంగా వెతికారు. కాలు కనిపించిన చోటనే సెల్‌ ఫోన్‌ చిప్‌ దొరికింది. దానిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వారం రోజులుగా కన్పించడం లేదట. ఈ కాలు అతనిదేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్‌ఏ నివేదిక వస్తేనేగానీ ఆ కాలు ఎవరిదనేది గుర్తించలేమని పోలీసులు అంటున్నారు. 

ఎలా వచ్చింది..? 
ఇది ఎలా వచ్చింది..? ఆ వ్యక్తిది హత్యా..? ప్రమాదమా..? అందరూ అడుగుతున్న ప్రశ్నలివి. సమాధానాల్లేవు. కేటీపీఎస్‌కు విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గును కొత్తగూడెంలోని బొగ్గు గనుల నుంచి వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తారు. బొగ్గు చోరీ చేసేందుకు వ్యాగన్‌ ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడా..? ఎవరైనా హత్య చేసి శరీర భాగాలను వ్యాగన్లలో పడేశారా? ఇలా, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే వ్యాగన్లలో మృతదేహాలు కనిపించినట్టుగా ఇక్కడి కార్మికులు చెబుతన్నారు. ‘‘ప్రమాదాల్లోనే వారు మృతిచెందినట్టుగా ఆ తరువాత తెలిసింది’’ అని అక్కడి కార్మికులు చెప్పారు. కాలు మాత్రమే కనిపించడంతో, ఇది ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సై రవి, కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు