గుంటూరులో కీచక తండ్రి అరెస్టు

7 Jan, 2020 05:10 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ డీఎస్పీ సుప్రజ, వెనుక నిందితుడు

2016లో కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి 

గర్భవతిని చేసి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు

గుంటూరు ఈస్ట్‌: మైనర్‌ కుమార్తెను గర్భవతిని చేసి, ఆమె ఆత్మహత్యకు కారణమై మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పెండింగ్‌ కేసుల సమీక్ష చేస్తున్న సమయంలో నిందితుడు తప్పించుకు తిరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి.రామకృష్ణ, ఈస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించడంతో కీచకుడు పోలీసుల చేతికి చిక్కాడు. గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ కె.సుప్రజ, ఎస్‌హెచ్‌వో ఫిరోజ్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నల్లచెరువు 19వ లైనులో నివసించే మహంకాళి నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు. 2016 ఆగస్టు 8న మైనర్‌ అయిన రెండో కుమార్తెకు వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి అల్లుడు, కుమార్తె నాగరాజు ఇంట్లోనే కాపురం పెట్టారు.

కీచక మనస్తత్వం ఉన్న నాగరాజు తన కుమార్తెపై కన్నేశాడు. అల్లుడు, భార్య కూలి పనులకు వెళ్లినప్పుడు కుంటి సాకులు చెప్పి ఇంటి వద్దే ఉండి కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. కుమార్తెను అల్లుడితో కాపురం చేయకుండా దూరంగా ఉండమని బెదిరించాడు. కొంతకాలానికి కుమార్తె గర్భం దాల్చడంతో ఎవరికీ చెప్పవద్దని బెదిరించి వేధించాడు. తీవ్ర మానసిక వేదనకు గురైన బాలిక 2017 మార్చి 22వ తేదీన ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో నాగరాజు దుర్మార్గానికి తెగబడ్డాడని నిర్ధారణ అయింది. తండ్రి అఘాయిత్యం వల్లే కుమార్తె గర్భం దాల్చిందని డీఎన్‌ఏ రిపోర్టులో తేలింది. నిందితుడు అప్పటి నుంచి పలు చోట్ల మార్బుల్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ నేరాల పునఃసమీక్ష సమయంలో ఈ ఘటనపై ఆరా తీసి నిందితుడిని పట్టుకోవాల్సిందిగా ఆదేశించారు. నిందితుడు ప్రస్తుతం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్నాడని తెలిసి సోమవారం అతనిని అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు