ఎంబీబీఎస్‌ రాక.. బీడీఎస్‌ ఇష్టం లేక..

27 May, 2020 05:07 IST|Sakshi
అలేఖ్య టవర్స్, సాహితి మృతదేహం (ఇన్‌సెట్‌)

అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

తండ్రి రఘురాం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

నాగోలు: ఎంబీబీఎస్‌ చదవాలనే కోరికున్నా.. అది రాకపోవడంతో బీడీఎస్‌ కోర్సులో చేరింది ఓ విద్యార్థిని. అయితే ఎంబీబీఎస్‌ రాలేదని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌ సాగర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని అలేఖ్య టవర్స్‌లో 14వ అంతస్తులో రఘురాం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కేపీఎస్‌ సాహితీ (25) కోఠిలోని ఉస్మానియా ప్రభుత్వ డెంటల్‌ కాలేజీలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. గతంలో రెండుసార్లు ఎంబీబీఎస్‌ పరీక్షలు రాసినా సీటు రాలేదు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో అయిష్టంగానే బీడీఎస్‌లో చేరింది. అప్పుడప్పుడూ ఈ కోర్సు చేయడం ఇష్టం లేదని.. ఎంబీబీఎస్‌ సీటు వస్తే బాగుండేదని తల్లిదండ్రులతో అంటుండేది. కాగా, ఫిబ్రవరిలో సాహితీ అన్నయ్య కృష్ణ భరద్వాజ్‌ అమెరికా నుంచి భార్యతో కలసి వచ్చాడు. లాక్‌డౌన్‌ కారణంగా వారు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న రఘురాం ఎప్పటిలాగానే మంగళవారం విధులకు వెళ్లారు. బీడీఎస్‌ కోర్సు చేయడం ఇష్టం లేని సాహితీ మానసికంగా ఆందోళనకు గురై.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌ 14వ అంతస్తులోని బాల్కనీలో ఉన్న గ్రిల్స్‌ తొలగించి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ ఇంట్లో ఉన్న తలిక్లి సమాచారం అందించాడు. తల్లి, ఇతర కుటుంబసభ్యులు కిందకు వచ్చి సాహితీని పరిశీలించే సరికే ఆమె రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. వెంటనే కుటుంబసభ్యులు రఘురాం కు సమాచారం ఇచ్చారు. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘సోమవారం సాయంత్రమే.. ఎంబీబీఎస్‌ చేస్తే బాగుండేది. బీడీఎస్‌ కోర్సు అయిష్టంగా చదవాల్సి వస్తోంది. దీనికి భవిష్యత్‌ అవకాశాలు కూడా సరిగా లేవని వాపోయింది. ఇంత పని చేస్తుందని ఊహించలేద’ని రఘురాం పేర్కొన్నారు. ఆత్మహత్య సమాచారం అందుకు న్న ఎల్‌బీనగర్‌ డీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ ఎస్‌.సుధాకర్‌ ఘటనాస్థలికి చేరుకు ని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి రఘురాం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు