పిచ్చాసుపత్రిలో హీరో మాజీ బాడీగార్డ్‌

26 Sep, 2019 15:49 IST|Sakshi

మొరదాబాద్‌: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మాజీ బాడీగార్డ్‌ ఒకరు పిచ్చాసుపత్రి పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ నగరంలో రద్దీ రోడ్లపై బీభత్సం సృష్టించడంతో అతడిని గురువారం మెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. అనాస్‌ ఖురేషి గతంలో ఏడాదిన్నర పాటు సల్మాన్‌ఖాన్‌ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేశాడు. బుధవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లేముందు పెద్ద మొత్తంలో అతడు మెడిసిన్స్‌ తీసుకున్నాడు. ఎక్కువ బరువులు ఎత్తేందుకు, శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే ఔషధాలను ఎక్కువగా తీసుకోవడంతో వాటి ప్రభావం కారణంగా రోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. గురువారం ఉదయం అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాదచారులపై అకారణంగా దాడులకు దిగాడు. ఇనుప కడ్డీ తీసుకుని కార్ల అద్దాలు పగలగొట్టాడు.

అతడిని కంట్రోల్‌ చేసేందుకు ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో అనాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. చేపల వల సాయంతో అతడిని బంధించి తాళ్లతో కట్టేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి ఔషధాలు సేవించడం వల్ల అనాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ బరేలీలోని మెంటల్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మంత్రి వద్ద అంగ రక్షకుడిగా పనిచేస్తున్న అనాస్‌ గత పది రోజులుగా తన సొంతూరు మొరదాబాద్‌లో ఉన్నాడు. ఇటీవల నిర్వహించిన మిస్టర్‌ మొరదాబాద్‌ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు