బైకులే వేరు నంబరు ఒక్కటే

25 Apr, 2019 11:49 IST|Sakshi
ఏపీ31 ఇజె 2321 నంబరు గల ఒరిజినల్‌ యూనీకార్న్‌ ద్విచక్రవాహనం శ్రీకాకుళంలో రవాణా శాఖ తనిఖీలో ఇదే నంబరుతో పట్టుబడిన మరో వాహనం

విశాఖపట్నం, తగరపువలస: వాహనదారులూ జర జాగ్రత్త. ఇలాంటివి మీకు ఎదురుకావొచ్చు. విషయం ఏమిటంటే...జీవీఎంసీ భీమిలి జోన్‌ 27వ వార్డు సంగివలస అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన కొయ్యాన శ్రావణ్‌కుమార్‌ తన ఏపీ 31 ఈజె 2321 నంబరు గల ద్విచక్రవాహనం సీబీ యూనీకార్న్‌పై ఇటీవల నగరంలో హెల్మెట్‌ లేకుండా వస్తూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. పోలీసులు నంబర్‌ నోట్‌ చేసుకుని అపరాధ రుసుం చెల్లించాలని శ్రావణ్‌కుమార్‌ ఇంటికి ఇ–చలానా పంపించారు.

అందులో ప్రస్తుత జరిమానాతో పాటు గతంలో శ్రీకాకుళంలో చెల్లించిన జరిమానా మరో రెండు బకాయిల అపరాధ రుసుములు చూపించారు. శ్రావణ్‌ గాని అతని తండ్రి కృష్ణ గాని అంతకు ముందెన్నడూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టుగాని, అర్హత పత్రాలు లేకుండా గాని అటు రవాణా శాఖ ఇటు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కింది లేదు. అయినప్పటికీ బకాయిలు చూపించడంతో వీటిని ఆన్‌లైన్‌లో చూసేసరికి తమ వాహనం నంబరే వేర్వేరు ద్విచక్రవాహనాలకు కలిగి ఉండటంతో ఖంగు తిన్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. రవాణా శాఖ ఒకే నంబరును అనేక మందికి జారీ చేసిందా లేదా వేర్వేరు వ్యక్తులు అదే నంబరును దొంగదారిన వినియోగిస్తున్నారా అని తలలు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని వాహనదారుడు శ్రావణ్‌ కుమార్‌కు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు