రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

29 May, 2019 12:29 IST|Sakshi
రాత్రివేళల్లో ట్రాక్టర్లలో తరలిస్తున్న మట్టి

రాత్రి వేళ తరలిపోతున్న కోట్ల రూపాయల మట్టి

అధికారం కోల్పోయినా ఆగని తెలుగు తమ్ముళ్ల అక్రమాలు

మంగళగిరి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. మరో రెండు రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయినప్పటికీ రాజధాని గ్రామాల్లో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు ఆగడం లేదు. అధికారులంతా ఎన్నికల హడావుడి నుంచి బయటకు రాకపోవడం టీడీపీ నాయకులకు  కలిసివచ్చింది. ఇదే అదనుగా కోట్ల రూపాయల మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాజధాని గ్రామాలైన నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, బేతపూడి గ్రామాల్లో రాత్రి తొమ్మిది దాటితే మట్టి ట్రాక్టర్‌లు, లారీలు హడలెత్తిస్తుండడం ఆయా గ్రామాల వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి తొమ్మిది గంటలనుంచి ఉదయం ఆరు గంటల వరకు వందలాది ట్రాక్టర్‌లు, లారీలు మట్టిలోడులతో తరలివెళ్తున్నాయి. రాజధాని నిర్మాణానికి భూసమీకరణకు ఇచ్చిన భూములతో పాటు రాజధానిలో నిర్మాణం జరుపుకొంటున్న రోడ్ల నిర్మాణాల కోసం తవ్విన మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈనెల 23 వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించినా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడకపోవడంతో అధికారులు సైతం సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు రోజుకు వంద ట్రాక్టర్లకు పైగా  మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు చేస్తున్న స్వైర విహారంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు రాత్రి తొమ్మిది దాటితే బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ట్రాక్టర్లలో సౌండ్‌ బాక్స్‌లు పెట్టి సినిమా పాటలతో హోరెత్తిస్తుండడంతో ఆయా గ్రామాల్లో రోడ్ల వెంట వున్న నివాసాల్లోని వారు నిద్రకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రోజూ లక్షల విలువైన మట్టిని బయటకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా నూతనంగా అధికారం చేపట్టిన పాలకులు, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ మట్టి తోలకాలను నివారించి గ్రామాలు ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజధాని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. మట్టి తోలకాలపై సీఆర్‌డీఏ అధికారులతో పాటు మైనింగ్‌ ఏడీ శ్రీనివాసరావును వివరణ కోరగా తాము మట్టి తోలకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు