రెచ్చిపోతున్న ఇసుకాసురులు

1 Jun, 2019 13:15 IST|Sakshi
ట్రాక్టర్‌కు ఇసుక ఎత్తుతున్న కూలీలు

మామిడిపల్లిలో జోరుగా ఇసుక రవాణా

సాలూరు రూరల్‌: మండలంలోని మామిడిపల్లి శివారు సువర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు లేకున్నా అక్రమార్కులు మరీ బరితెగించి తవ్వకాలు చేపడుతున్నారు. మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు మైనింగ్‌శాఖలో పనిచేస్తున్నాడు. ఇతని అండదండలతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సాలూరు, మక్కువ మండలాలకు అవసరమైన ఇసుకను ఇక్కడ నుంచి తరలిస్తున్నారంటే ఎంత దర్జాగా ఇసుకను దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్‌ ఇసుక రూ. 1200నుంచి 1500 రూపాయల మధ్య విక్రయిస్తూ అక్రమార్కులు రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

సువర్ణముఖి నదికి తూట్లు పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా ఇదే రీతిన గతంలో దాగరవలస సమీపంలోని ఓ గెడ్డలో నుంచి టీడీపీ నాయకులు ఇసుకను తరలించారు. ఇప్పుడు సువర్ణముఖి నది వంతు వచ్చింది. పట్టపగలే యథేచ్ఛగా తవ్వకాలు జరిపి ఇసుక తరలిస్తున్నా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వెనుక ఎవరికి ఎంతెంత ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులను కూడా అక్కమార్కులు పీకేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు