ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా

26 Jun, 2018 14:41 IST|Sakshi
బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు 

మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు

కాటారం : ఇసుక లారీల కారణంగా వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా ప్రభ్వుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. మండలంలోని నస్తూర్‌పల్లి సమీపంలో ఇసుక టిప్పర్‌ ఢీకొని యువ రైతు బాల్నె జనార్దన్‌  మృతి చెందగా శ్రీధర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ అక్రమాజర్జన కోసం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక లారీల కారణంగా రోజుకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, చాలా మంది వికాలాంగులుగా నరకం అనుభవిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఎన్ని కోట్ల బడ్జెట్‌ వస్తుందని చూస్తుందే తప్పితే ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారని మాత్రం ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వానికి ఇసుక మాఫీయా అవసరం తప్పితే ప్రజల ప్రాణాలు అవసరం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అక్రమ దందాలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్‌ అధికారులను సైతం అక్రమార్కులు ప్రభుత్వంతో కుమ్మకై బదిలీ చేయించారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక మాఫీయా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, క్వారీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏ చట్టం ప్రకారం అటవీశాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతుడు జనార్దన్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు సమ్మయ్య, భాస్కర్, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, సందీప్, బాపురెడ్డి, ప్రభాకర్, నరేశ్, వెంకటస్వామి,  రమేశ్‌రెడ్డి,  విక్రమ్, రామిళ్ల కిరణ్, మాజీ ఎంపీపీ బాపు, వామనరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు