జూపార్కులో గంధపు చెట్లు మాయం

16 Jul, 2019 10:35 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న పోలీసులు

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని రెండు గంధపు చెట్లను దొంగలు నరుక్కెళ్లిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూ పార్కులో మీరాలం ఈద్గా వైపు గంధపు చెట్లు ఉన్నాయి. మీరాలం ఈద్గా సమీపంలోని గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు రెండు గంధపు చెట్లను నరుక్కెళ్లారు. జూపార్కు అసిస్టెంట్‌ క్యూరేటర్‌–3 సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బహదూర్‌పురా అదనపు ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌ సోమవారం గంధపు చెట్లు చోరీకి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. గంధపు చెట్ల మాయంపై జూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలోనూ జూ పార్కులో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు