స్మగ్లింగ్‌ రూట్‌ మారింది

5 Dec, 2019 13:12 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ రఘు, చిత్రంలో సీఐ, ఎస్సైలు

వాటర్‌ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగల అక్రమరవాణా

వెంబడించిన పోలీసులపై రాళ్లు విసిరిన దొంగలు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

92 దుంగల స్వాధీనం..విలువ రూ.1.25 కోట్లు పరారీలో 11 మంది

సీతారామపురం: వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీరు తరలిస్తున్నట్టుగా నమ్మించారు. అయితే ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మండలంలోని చింతోడు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో బుధవారం సీతారామపురం పోలీసులు 92 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దుంగలను కావలి డీఎస్పీ రఘు పరిశీలించి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వింజమూరుకి చెందిన భీమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, చింతోడుకి చెందిన రాచూరి రవి కొందరితో కలిసి చింతోడు అటవీ ప్రాంతంలో దుంగలు నరికించారు. సమీపంలో చెరువు దగ్గర వాటర్‌ ట్యాంకర్‌లో నీళ్లు నింపుతున్నట్లుగా నటించి అందులో దుంగలను ఉంచారు. ట్యాంకర్‌ ద్వారా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారని సీతారామపురం పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఎస్సై రవీంద్రనాయక్‌ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

రాళ్లు విసిరి..
చెరువు వద్దకు చేరుకున్న పోలీస్‌ వాహనాన్ని చూసిన ఎర్రచందనం దొంగలు ట్యాంకర్, రెండు మోటార్‌బైక్‌లు, ఒక ఆటోని వదిలి పోలీసులపై రాళ్లు విసురుతూ పరిగెత్తారు. దీంతో పోలీసులు వెంబడించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 11 మంది పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో 92 ఎర్రచందనం దుంగలున్నాయి. వాటిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ట్యాంకర్, బైక్‌లు, ఆటో ఖరీదు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని ఓబుల్‌రెడ్డి, పవన్‌కుమార్‌గా గుర్తించి వారిని విభిన్న కోణాల్లో విచారిస్తున్నారు. ఎర్రచందనం దొంగలను పట్టుకుని, దొంగలను స్వాధీనం చేసుకున్న ఎస్సై రవీంద్రనాయక్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఉదయగిరి సీఐ ఉప్పాల సత్యనారాయణ, ఎస్సై ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు