శశికళపై ఆగ్రహం

13 Mar, 2018 12:31 IST|Sakshi
శశికళ (పాత చిత్రం)

వాంగ్మూలం సమర్పణలో సాకులపై అసహనం

ఎట్టకేలకు వాంగ్మూలం సమర్పించిన శశికళ

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక  మరణం వెనుక నెచ్చెలి శశికళ ప్రమేయం ఉన్నట్లు నెలకొన్న అనుమానాలను బలపరిచే విధంగా ఆమె వ్యవహరించడంపై విచారణ కమిషన్‌ అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన శశికళ సోమవారం ఎట్టకేలకు కమిషన్‌కు తన న్యాయవాది ద్వారా వాంగ్మూలాన్ని సమర్పించారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజల మధ్యనే తిరుగుతుండిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 సెప్టెంబరు 22వ తేదీన అకస్మాత్తుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆమె స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి ప్రకటించింది. అయితే 78 రోజులపాటూ ఆసుపత్రిలోనే చికిత్స పొందిన జయలలిత అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. ఆసుపత్రిలో ఉండగా జయ ఫొటోలు విడుదల చేయకపోవడం, చూసేందుకు ఎవ్వరినీ అనుమతించకపోవడం, స్వల్ప అనారోగ్యంతో మరణించడం తదితర కారణాలతో అందరూ శశికళను అనుమానంగా చూశారు. న్యాయవిచారణ లేదా సీబీఐ  విచారణకు విపక్షాలు పట్టుబట్టాయి. జయ మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం తమిళనాడు ప్రభుత్వం గత  ఏడాది విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆరుముగస్వామిని కమిషన్‌ చైర్మన్‌గా  నియమించింది. కమిషన్‌ ముందు ఇప్పటి వరకు సుమారు 30 మంది తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వీరిలో అధికశాతం జయ నెచ్చెలి శశికళకు వ్యతిరేకంగా తమ వాంగ్మూలాలను సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 21వ తేదీన శశికళకు సమన్లు జారీ అయ్యాయి. శశికళకు వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని సమర్పించినవారిని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసేందుకు అనుమతించాల్సిందిగా ఈ పిటిషన్‌లో ఆయన కోరుతూ జనవరి 5, 12 తేదీల్లో శశికళ తరఫు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి వారం రోజుల్లోగా వాంగ్మూలాన్ని దాఖలు చేయాలని జనవరి 30వ తేదీన కమిషన్‌ చైర్మన్‌ ఆరుముగస్వామి శశికళకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు నుంచి 15 రోజుల్లోగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయవచ్చని అనుమతించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6వ తేదీన శశికళ తరఫు న్యాయవాది కొత్త పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో... సాక్ష్యం చెప్పిన 22 మంది వివరాలు మాత్రమే సరిపోదు, వారు సమర్పించిన వాంగ్మూలాలు సైతం తమకు అందజేయాలని, వాటిని సమర్పించిన పది రోజుల్లోగా తమ వాంగ్మూలాన్ని అందజేస్తామని కోరాడు.

అందరినీ విచారణ జరిపిన తరువాత ఏడు రోజులు అవకాశం ఇస్తే ఆ తరువాత క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తామని కోరారు. శశికళ పిటిషన్‌పై ఫిబ్రవరి 12వ తేదీన విచారణ జరిపిన అనంతరం 18 మంది సాకు‡్ష్యలు సమర్పించిన 2,956 పేజీల 450 వాంగ్మూలాలను అందజేస్తామని కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళ వాంగ్మూలం సమర్పణకు 15 రోజులు అవకాశం ఇవ్వాలని ఫిబ్రవరి 26న కమిషన్‌ చైర్మన్‌ కార్యదర్శి కోమలకు వినతిపత్రం సమర్పించాడు. దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ జరిపిన చైర్మన్‌ ఆరుముగస్వామి శశికళ న్యాయవాది సమర్పించిన పిటిషన్‌ను కొట్టివేశారు. బెంగళూరు జైలుకెళ్లి శశికళను విచారించాల్సి వస్తుంది లేదా వాంగ్మూలం దాఖలుకు శశికళ సహకరించడం లేదనే నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చైర్మన్‌ హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన శశికళ న్యాయవాది అరవిందన్‌ సోమవారం ఆమె వాంగ్మూలాన్ని కమిషన్‌కు సమర్పించారు. ఇకపై ఎవరెవరి వద్ద నుంచి వాంగ్మూలాలు సేకరిస్తారు తమకు తెలియజేయాల్సిందిగా శశికళ న్యాయవాదులు కమిషన్‌ను కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు