హల్దీ బచావో..

19 Jul, 2019 14:34 IST|Sakshi
టిప్పర్‌లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న దృశ్యం

హల్దీ ప్రాజెక్ట్‌ నుంచి అక్రమంగా మొరం, మట్టి రవాణా 

పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 

నీటి నిల్వలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు

సాక్షి, తూప్రాన్‌: వెల్దుర్తి మండలంలోని హకింపేట, అచ్చంపేట, కొప్పులపల్లి, హస్తాల్‌పూర్, మెల్లూర్, ఉప్పులింగాపూర్, ఆరెగూడెం, పంతులుపల్లి, దామరంచ, కుకునూర్‌ తదితర గ్రామాల్లోని పంట పొలాలకు సాగు నీరందించే వరప్రదాయని హకింపేట శివారులోని హల్దీప్రాజెక్ట్‌. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అక్రమ మట్టి, మొరం రవాణా మూడు హిటాచీ యంత్రాలు ఆరు టిప్పర్‌లు అన్న చందంగా తయారైంది.  

వాల్టా చట్టానికి విరుద్ధంగా.. 
ప్రతి రోజు ప్రాజెక్ట్‌లోని వెనుక భాగంలో పెద్ద పెద్ద హిటాచీ, జేసీబీ యంత్రాలతో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం, నల్లమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు స్థానికంగా భూములు కొనుగోలు చేసిన నగరంలోని బడా భూస్వాములకు తరలిస్తుండగా మరికొందరు ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా గత కొద్ది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో టిప్పర్‌ల ద్వారా మట్టిని తరలించడంతో ప్రాజెక్ట్‌ వెనుకభాగంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరితే లోతు తెలీక మూగజీవాలు, పశువుల కాపరులు మృత్యువాత పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు.  

ఫిర్యాదు చేస్తే బెదిరింపులు!
అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు సమాచారం అందిస్తే అడ్డుకోవాల్సింది పోయి వారు సంబంధిత అక్రమార్కులకు తమ ఫోన్‌ నంబర్‌లు ఇస్తున్నారని, ఫలితంగా సంబంధిత వ్యక్తుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు అలవాటుపడటం వల్లే ప్రాజెక్ట్‌లో విలువైన మట్టిని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట పొలాలకు మట్టి తీసుకెళ్తే నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేసే అధికారులకు అక్రమ రవాణా కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు హల్దీ ప్రాజెక్ట్‌లో అక్రమ తవ్వకాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఇరిగేషన్‌ ఎస్‌ఈ అనంతరెడ్డి ఆదేశాలను కిందిస్థాయి అధికారులు పెడచెవిన పె డుతున్నారు. ప్రాజెక్ట్‌ శిఖం భూమిలో ఆక్రమణకు గురైన స్థలాలను సర్వే చేపట్టి కబ్జా జేసిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించినా సిబ్బంది పట్టించుకోడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాళేశ్వరం నుంచి నీరు వచ్చే అవకాశం.. 
కాళేశ్వరం కాలువ ద్వారా సాగునీరు హల్దీ ప్రాజెక్ట్‌లోకి చేరే అవకాశం ఉన్నందున, ప్రాజెక్ట్‌ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు పూర్తిగా నిషేధించి, శిఖం ప్రాంతాన్ని పూర్తిగా సంరక్షించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.   

విజిలెన్స్‌ ఏర్పాటు చేస్తాం 
హల్దీ ప్రాజెక్ట్‌ నుంచి అక్రమంగా మొరం, మట్టి తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. రెవిన్యూ, పోలీస్‌ అధికారులచే విజిలెన్స్‌ టీం ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా రవాణా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.  
– శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్‌  

మరిన్ని వార్తలు