దోంగ క్యాషియర్‌ అరెస్టు!

8 Jul, 2019 08:28 IST|Sakshi
క్యాష్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరావు

సాక్షి, కంచికచర్ల(నందిగామ): కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్యాష్‌ ఇన్‌చార్జి జి.శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ, విజయవాడకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు గత కొంతకాలంగా కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్యాష్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో బ్యాంకు మేనేజర్‌ కాకొల్లు యోగిత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించాడు. ఇద్దరి బాధ్యత కలిగిన క్యాష్‌ లావాదేవీలు, గోల్డ్‌లోన్స్‌ లావాదేవీల తాను ఒక్కడే నిర్వర్తించే విధంగా నమ్మించాడు. మేనేజర్‌ వద్ద ఉన్న తాళం కూడా తీసుకుని లాకర్‌లను ఓపెన్‌ చేసి పనులు చక్కబెడుతున్నాడు.

మేనేజర్‌తో సంబంధం లేకుండా..
శ్రీనివాసరావు ఒకరోజు మేనేజర్‌కు తెలియకుండా లాకర్‌ నుంచి రూ.19లక్షలు, 3 గోల్డ్‌బ్యాగ్‌లు లాకర్‌లో నుంచి దొంగిలించాడు. తాకట్టు పెట్టిన ఒకరి బంగారు ఆభరణాలపై మరొకరి పేరుమీద లోన్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి గోల్డ్‌లోన్‌ నగదు మొత్తం తీసుకున్నాడు. రెన్యువల్‌ కోసం ఖాతాదారుల వద్ద డెబిట్, క్రెడిట్‌ ఓచర్‌పై సంతకాలు తీసుకుని కొత్తఖాతాను తయారుచేసి పాత ఖాతాలో డబ్బులు చెల్లించకుండా ఆ సొమ్మును సొంతానికి, విలాసానికి వాడుకున్నాడు. బ్యాంకు మేనేజర్‌ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని లాకర్‌లోని బంగారాన్ని దొంగిలించి ఆ బంగారం నగలను ఆప్కాబ్‌ లిమిటెడ్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ, నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని సొంతానికి ఉపయోగించుకున్నాడు. 

మేనేజర్‌ నిలదీయడంతో..
నగలు మయం కావడంతో విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావును నిలదీయగా నగదుతో పాటు బంగారం కూడా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను దొంగిలించిన సొత్తును, నగలను రెండురోజులలో తిరిగి బ్యాంకుకు అందజేస్తామని నమ్మబలికాడు. కాని నాటి నుంచి విధులకు రాకుండా   శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. బ్యాంకులో జరిగిన విషయాల గురించి బ్యాంకు మేనేజర్‌ యోగిత బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంకు మేనేజర్‌ యోగితను ఇతర బ్యాంకుకు బదిలీచేశారు. క్యాష్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరావును సస్పెండ్‌ చేశారు. గల్లా ఓం ప్రకాష్‌ను బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరావుపై కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నిందితుడి నుంచి రికవరీ.....
నిందితుడు శ్రీనివాసరావు నుంచి నగదు రూ.20,75 లక్షలు, 2,200 గ్రాముల బంగారం నగలు, కారు రూ.6,25లక్షలు మొత్తం రూ.88లక్షలు రికవరీ చేసుకోవటం జరిగిందని తెలిపారు. శ్రీనివాసరావును అరెస్ట్‌చేసి నందిగామ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో నందిగామ డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రజీజ్, సర్కిల్‌ సీఐ కే సతీష్, ఎస్‌ఐ శ్రీహరిబాబు, ఏఎస్‌ఐలు ఎంవీ కోటేశ్వరరావు, షేక్‌ జమీల్‌ పాల్గొన్నారు. 

పోలీసులకు రివార్డులు అందజేత
 నగదుతోపాటు బంగారు నగలు దొంగతనం కేసులో బ్యాంక్‌ క్యాష్‌ ఇన్‌చార్జి గొడవర్తి శ్రీనివాసరావును త్వరగా అరెస్టు చేయటం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం వచ్చిన జిల్లా ఎస్పీ, అనతికాలంలో బ్యాంకులో నగలు, నగదు దొంగతనానికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసినందుకు 8 మందికి రివార్డులు అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సర్కిల్‌ సీఐ కే సతీష్, ఎస్‌ఐ శ్రీహరిబాబు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆలి, నాగరాజు, ప్రభాకర్, రఘు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కే రామారావు, హనుమంత్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు