చిదంబరానికి స్వల్ప ఊరట

18 Nov, 2019 12:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైల్లో జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరుతూ చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.  సుప్రీంకోర్టు 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే నేతృత్వంలోని  ధర్మాసనం మంగళవారం కానీ, బుధవారం గానీ దీనిపై వాదనలను విననుంది. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బెయిల్‌ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

కాగా  మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో  చిదంబరం బెయిల్‌ అభ్యర్థనను  తిరస్కరించిన స్పెషల్‌ కోర్టు  ఈ నెల 27 వరకు జ్యూడిషియల్ కస్టడీని  పొడిగించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే  2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు