చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

2 Sep, 2019 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై న్యాయ విద్యార్థి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల  కేసులో కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసును  స్యుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు  సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు బాధిత యువతి తన  ఎల్‌ఎల్‌ఎం కోర్సును  కొనసాగించేందుకు వీలుగావేరే కాలేజీకి బదిలీ చేయాలని  యోగి ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఐజీ స్థాయి పోలీసు అధికారి  ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించాలని సూచించింది.  అనంతరం  కేసును అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం బదిలీ చేసింది. అలాగే బాధితురాలితో పాటు,  ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. న్యాయమూర్తుల బృందం గురువారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు లేఖ రాయడంతో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చేపట్టింది.

కాగా బీజేపీ నాయకుడు  చిన్మయానంద్‌పై  చిన్మయానంద్‌కు చెందిన లా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసిన అనంతరం కనిపించకుండా  పోయింది.  చివరకు న్యాయవాదులు, కోర్టుల జోక్యంతో  ఆమెను రాజస్థాన్‌లో గుర్తించారు పోలీసులు. అనంతరం  గత శుక్రవారం  సుప్రీంకోర్టులో హాజరుపరిచారు.  అయితే తనను తాను రక్షించుకునే క్రమంలో తన ముగ్గురు కళాశాల సహచరులతో కలిసి  షాజహాన్‌పూర్‌ నుంచి పారిపోయానని  బాధిత యువతి న్యాయమూర్తులకు తెలిపిన సంగతి విదితమే.

చదవండి : మాజీ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు 

చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన యువతి ఆచూకీ లభ్యం

మరిన్ని వార్తలు