‘ఇన్నోసెంట్‌’గా మోసం చేశారు

20 Jan, 2019 02:39 IST|Sakshi
ప్రధాన నిందితుడు ఎడిగో ఇన్నోసెంట్‌

సిమ్‌ స్వాపింగ్‌తో దాదాపు 13 కంపెనీలకు కోట్లలో కుచ్చుటోపీ 

సిటీకి చెందిన మూడు కంపెనీల్లో రూ.33 లక్షల వరకు చీటింగ్‌ 

ఫిషింగ్‌ మెయిల్స్‌తో కంపెనీ వివరాల సేకరణ 

ఆరుగురిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నోసెంట్‌..పేరులో అమాయకత్వం ఉన్నా మనిషి మాత్రం మాయ దారి మోసగాడే. ఫిషింగ్‌ మెయిల్స్‌ చేసి కంపెనీ వివరాలు, ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని.. దాని ద్వారా సిమ్‌ స్వాప్‌ చేసి సైలెంట్‌గా కంపెనీల బ్యాంకు ఖాతాల్ని గుల్లచేసేస్తుందీ అ‘మాయ’క బృందం. కంపెనీల ఖాతాలో డబ్బుల్ని కొల్లగొట్టే ప్రణాళికను నైజీరియాలో వేసి కోల్‌కతా కేంద్రంగా అమలుచేసి తప్పించుకునే ఎబిగో ఇన్నోసెంట్‌ ముఠాను అంతే చాకచక్యంగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. కోల్‌కతాలో అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారంట్‌పై శనివారం నగరానికి తీసుకొచ్చిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. 

సిమ్‌ స్వాపింగ్‌తో స్వాహా.. 
నైజీరియాకు చెందిన ఎబిగో ఇన్నోసెంట్‌ అలియాస్‌ జేమ్స్‌ కోల్‌కతాలో ఉన్న సమయంలో ఫుట్‌బాల్‌ ఆడేందుకు వచ్చిన మరో నైజీరియా వాసి ఒడాఫీ హెన్రీతో 2014లో పరిచయమేర్పడింది. వీరిద్దరూ కలసి సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా చేసే మోసాలకు తెరదీశారు. డబ్బుల బదిలీకి నకిలీ పేర్లతో బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చే కోల్‌కతాకు చెందిన సంతోశ్‌ బెనర్జీ, రిజిష్టర్డ్‌ సెల్‌నంబర్‌ వివరాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు, చిరునామాలు సృష్టించి డూప్లికేట్‌ సిమ్‌ సంపాదించే రాజత్‌ కుందులను హెన్రీకి పరిచయం చేశాడు. అనంతరం నైజీరియాకు వెళ్లిపోయిన ఎబిగో ఇన్నోసెంట్‌ హ్యాకర్లు హ్యాక్‌ చేసిన కంపెనీ వివరాలను డార్క్‌నెట్‌లో కొనుగోలు చేశాడు. భారత్‌లోని కంపెనీల ఈ–మెయిల్స్‌కు ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపించి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల వివరాలు, రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబర్, కంపెనీ పేరు, చిరునామాలను సేకరించి హెన్రీ, రాజత్‌ కుందు, సంతోశ్‌ బెనర్జీలకు చేరవేసేవాడు. మొబైల్‌ టెలికామ్‌ స్టోర్స్‌లో రాజత్‌ కుందు తనకు పరిచయమున్న వారి ద్వారా మొబైల్‌ నంబర్‌ వివరాలు తెలుసుకునేవాడు. కంపెనీకి చెందిన రబ్బర్‌ స్టాంప్‌ను తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోల్‌కతాకు చెందిన చందన్‌ వర్మకు ఇచ్చేవాడు. అతడు సంజీవ్‌ దాస్‌ అనే వ్యక్తితో కలిసి వెళ్లి బాధితుడి సిమ్‌కు నకిలీ సిమ్‌ తీసుకునేవాడు.  

అలసత్వంతో లక్షలు పోగొట్టుకున్నా.. 
2017 జూన్‌ 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నా సెల్‌నంబర్‌ పనిచేయడం ఆగింది. ఎయిర్‌టెల్‌ కాల్‌సెంటర్‌కు కాల్‌ చేస్తే మీ నంబర్‌ పనిచేస్తుందని చెప్పారు. సోమవారం ఆ కంపెనీ మొబైల్‌ స్టోర్స్‌కు వెళితే మీ సిమ్‌ యాక్టివ్‌లోనే ఉంది. మీరు డూప్లికేట్‌ సిమ్‌ తీసుకున్నారా అని తిరిగి ప్రశ్నించారు. ఆధార్‌కార్డు, ఫింగర్‌ ప్రింట్‌ తీసుకొని మళ్లీ డూప్లికేట్‌ సిమ్‌ ఇచ్చారు. అయితే అప్పటికే నా సెల్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ ద్వారా రూ.24 లక్షల నగదు బదిలీలు కోల్‌కతాలోని బ్యాంక్‌లకు వెళ్లాయని తెలిసింది. సరైన తనిఖీ లేకుండా డూప్లికేట్‌ సిమ్‌ జారీ చేసిన సంస్థపై పోలీసులు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. 
    –గిరి, సిలికాన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

శనివారమే...పని కానిచ్చేస్తారు 
ఆయా టెలికం స్టోర్స్‌ నుంచి అసలు సిమ్‌ కార్డులకు డూప్లికేట్‌లను శనివారాల్లోనే పొంది సాయంత్రానికల్లా రాజత్‌ కుందుకు చేర్చేవారు. అతడు అదేరోజు దానిని యాక్టివ్‌ చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చెందిన వారి సెల్‌ నంబర్ల సేవలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో నిలిచేపోయేవి. సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేవని భావించిన కంపెనీ యజమానులు తిరిగి సోమవారం లోపు ఆయా టెలికం స్టోర్స్‌కు వెళ్లేలోపు వీరి బ్యాంక్‌ ఖాతాల నుంచి దశలవారీగా నగదు ఖాళీ అయిపోయేది. అనంతరం కొంత డబ్బును వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడంతో పాటు దుకాణాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలుచేసేవారు. వీటిని సంతోశ్‌ బెనర్జీ విక్రయించి నగదు రూపంలోకి మార్చి హెన్రీకి అప్పగించేవాడు. అనంతరం ఈ డబ్బుతో బట్టలు, వస్తువులు కొనుగోలు చేసి నైజీరియాలోని ఇన్నోసెంట్‌కు పంపేవారు.

దొంగలు దొరికారిలా.. 
ఈ విధంగానే నగరంలో ఎలిమ్‌ కెమికల్స్, షాలోమ్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాల నుంచి రూ. తొమ్మిది లక్షలు ఖాళీ కావడంతో చింతల్‌కు చెందిన వాటి యజమాని వెంకటకృష్ణ గతేడాది డిసెంబర్‌ 17న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంక్‌ఖాతా వివరాలతో పాటు సెల్‌నంబర్ల లోకేషన్‌ ఆధారంగా కోల్‌కతాలో ఉంటున్న ఆరుగురు నిందితులను అక్కడే అరెస్టు చేశారు. వీరి నుంచి 17 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు పాస్‌పోర్టులు, డెబిట్‌కార్డులు, ఆధార్‌కార్డులు, లామినేషన్‌ మెషీన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నై,కోల్‌కతా,అహ్మదాబాద్, ఢిల్లీలోని 11 పరిశ్రమలను చీటింగ్‌ చేసినట్టు  విచారణలో తేలింది.
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు.. 

గతంలో నగరానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిలికాన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.24 లక్షలు మోసం చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఒకడైన సంతోష్‌ బెనర్జీని 2015లో ఇటువంటి కేసులో జైపూర్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నిందితులను  కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ సజ్జనార్‌ అన్నారు. కాగా ఇందులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్‌ను పట్టుకునేందుకు నైజీరియాకు లేఖ రాస్తామని తెలిపారు. వెరిఫికేషన్‌ లేకుండా సిమ్‌ జారీ చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు