నాన్న! బతకాలనిలేదు అందుకే దూకేస్తున్నా..

29 Feb, 2020 09:25 IST|Sakshi
బాలుడు దూకిన జలపాతం ;ఇన్‌సెట్‌లో శివ్‌దాస్‌

సాక్షి, సిర్పూర్‌ : ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడూ వెంటే పెట్టుకుని తిరిగారు. అంతలోనే ఆ బాలుడికి ఫిట్స్‌ ఉందని తెల్సింది. అప్పటినుంచి అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆ బాలుడికి ఏమనిపించిందో ఏమో.. తండ్రి ఎదుటే జలపాతంలో దూకాడు. ఈ సంఘటన సిర్పూర్‌ (యూ) మండలం పంగిడి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. 20 గంటల అనంతరం ఆ బాలుడు విగతజీవిగా కనిపించాడు. స్థానికులు, ఏఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేశ్‌ముఖ జైరాం, పార్వతికి దేశ్‌ముఖ్‌ శివ్‌దాస్‌(15) ఏకైక సంతానం.

జైనూర్‌ మండలం పోచంలొద్ది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఫిట్స్‌ వస్తుండడంతో ఇంటి వద్ద నుంచే పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం శివ్‌దాస్‌ పాఠశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి గ్రామ శివారులోని పంట చేనుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి అన్నం తినేందుకు వెళ్లగా.. శివ్‌దాస్‌ అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తండ్రికి ఫోన్‌ చేసి గ్రామ సమీపంలోని కుండై జలపాతం వద్ద ఉన్నానని, త్వరగా రావాలి అంటూ ఫోన్‌ పెట్టేశాడు. కంగారుపడిన తండ్రి తనతోపాటు మరో నలుగురు గ్రామస్తులను తీసుకుని వెంటనే జలపాతం వద్దకు బయల్దేరాడు. వారిని చూసిన శివ్‌దాస్‌ తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ కిందపెట్టి జలపాతంలోకి దూకాడు. తండ్రి దూకొద్దంటూ కేకలు వేసినప్పటికీ వినిపించుకోలేదు. అప్పటికే చీకటి పడటంతో శివ్‌దాస్‌ ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్‌ నుంచి ఈతగాళ్లను రప్పించి వెతికించగా.. విగతజీవిగా కనిపించాడు. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు