మద్యం తాగి స్కూల్‌ బస్సు డ్రైవింగ్‌

12 Sep, 2018 13:22 IST|Sakshi
రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేసిన స్కూల్‌ బస్సు డ్రైవర్‌ శ్రీను

తనిఖీల్లో పట్టుబడిన డ్రైవర్‌

పశ్చిమగోదావరి, తణుకు/పెరవలి : మద్యానికి బానిసైన ఒక స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ నలభై మంది చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడాడు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ గుర్తించి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడూ మద్యం తాగి బస్సు నడుపుతుంటాడని తెలిసినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తణుకు పట్టణంలోని గౌతం మోడల్‌ స్కూల్‌కు చెందిన బస్సులో పెరవలి మండలం ఖండవల్లికి చెందిన భూసరపు శ్రీను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సోమవారం ఉదయం పెనుగొండ మండలం వడలి నుంచి పిల్లలను బస్సులో ఎక్కుంచుకుని తణుకు బయలుదేరాడు. పెరవలి మండలం నల్లాకుల వారిపాలెం వచ్చేసరికి అటుగా రావులపాలెం వైపు వెళుతున్న ఎంవీఐ శ్రీనువాస్‌ బస్సు హైవేపై అడ్డదిడ్డంగా వెళుతున్న  నడుస్తున్న తీరును గమనించి అనుమానం రావడంతో బస్సును అడ్డుకుని రికార్డులు తనిఖీ చేశారు. అయితే డ్రైవర్‌ శ్రీను ఫూటుగా మద్యం సేవించి ఉండటం గుర్తించి బస్సును పెరవలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి డ్రైవర్‌ మద్యం తాగి ఉండటాన్ని నిర్ధారించి కేసు నమోదు చేశారు. స్కూల్‌ బస్సును సీజ్‌ చేశారు.

ఎంవీఐ అప్రమత్తతతోనే..
తణుకు ఎంవీఐ ఎన్‌యూఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌ చాకచక్యంగా  అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెను ముప్పు తప్పింది. ఈ సమయంలో బస్సులో 42 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు.  ఎంవీఐ శ్రీనివాస్‌కు తణుకు వైపు వెళుతున్న స్కూలు బస్సు అడ్డదిడ్డంగా వెళుతుండటం కంట పడటంతో అప్రమత్తమయ్యారు. విద్యార్థులను సురక్షితంగా స్కూలులో దించిన రవాణాశాఖ అధికారులు బస్సును సీజ్‌ చేశారు. అయితే తరచూ డ్రైవర్‌ శ్రీను మద్యం తాగి స్కూలు బస్సు నడుపుతున్నాడని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయం  స్కూలు యాజమాన్యం దృష్టిలో ఉన్నా పట్టించుకోలేదని తెలుస్తోంది.  తమ పిల్లలను స్కూలుకు పంపిస్తుంటే ఇలా తాగుబోతు డ్రైవర్లను ఎలా నియమించుకుంటారని వారు యాజమాన్యాన్ని నిలదీశారు. ఎంవీఐ సరిౖయెన సమయంలో స్పందించంటం వలన పెనుప్రమాదం తప్పిందని లేకపోతే తమ పిల్లలు   ఏమయ్యేవారోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  బస్‌ డ్రైవర్‌ బి.శ్రీనివాస్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టులో హాజరుపరిచామని ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపారు.  విచారించిన అదనపు సివిల్‌ జడ్జి కె.శివశంకర్‌ డ్రైవర్‌ శ్రీనుకు ఏడ్రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు