నాలుగేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకం...

24 Apr, 2018 14:13 IST|Sakshi

ముంబై : లింగ బేధం లేదు, వయసు తేడా లేదు.. పసివాళ్లన్న జాలి, దయ ఏమాత్రం లేకుండా మానవ మృగాలు రెచ్చిపోతుంటే భద్రతకు తావేది..? గుడి కన్నా బడి పదిలం అన్నారు. కానీ బడిలోనూ రక్షణ లేదు. ఓ వైపు చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని చట్టాలు తెస్తుంటే మరో పక్క పసివాళ్లపై జరిగే దారుణాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఉన్నత వర్గాల వారు నివసించే మజగావ్‌ ప్రాంతంలోని ఓ కిండర్‌గార్డెన్‌ స్కూల్‌లో ఆయాగా పని చేసే 60 ఏళ్ల మహిళ నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిండర్‌గార్డెన్‌ స్కూల్లో చదువుతున్న ఓ చిన్నారి గత రెండు నెలల నుంచి పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బడి అంటేనే వణికిపోతుంది.

నిన్న ఆదివారం రాత్రి పాప తల్లిదండ్రులు చిన్నారిని బుజ్జగించి కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ చిన్నారి చెప్పిన విషయాలు వారికి వణుకు పుట్టించాయి. వైద్య పరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి పరిక్షించగా చిన్నారి వ్యక్తిగత శరీర భాగాల వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాప తల్లిదండ్రులు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలికి ఫోను చేసి విషయం చెప్పారు. దాంతో సోమవారం విధులకు హజరయిన ఆయను అదుపులోకి తీసుకుని బైకుల్లా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం  పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నది. పోలీసులు ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు