చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్‌ పైశాచికత్వం

20 Aug, 2019 04:16 IST|Sakshi
యశ్వంత్‌ను చితకబాదిన కరస్పాండెంట్‌ శివ

హోం వర్కు చేయలేదని చితకబాదడంతో తీవ్రగాయాలపాలైన విద్యార్థి

అడ్డుకున్న స్థానికులు, విలేకర్లను దుర్భాషలాడిన కరస్పాండెంట్‌ 

పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు..

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన

లక్కిరెడ్డిపల్లె: హోం వర్కు చేయలేదనే కారణంతో మూడో తరగతి విద్యార్థిని పాఠశాల కరస్పాండెంట్‌ చితకబాదాడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో సోమవారం జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం యనమలవాండ్లపల్లెకు చెందిన చిరంజీవి,రమాదేవి దంపతులు పొట్టకూటి కోసం ఇద్దరు బిడ్డలను అవ్వాతాతల దగ్గర వదిలి కువైట్‌కు వెళ్లారు. గ్రామంలో ప్రభుత్వ బడి మూతబడటంతో సమీపంలోని లక్కిరెడ్డిపల్లెలోని సందీప్‌ స్కూలులో ఈ బిడ్డలను చేర్పించారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌ మూడో తరగతి చదువుతున్నాడు.

హోం వర్క్‌ చేయలేదనే కారణంతో యశ్వంత్‌ను పాఠశాల కరస్పాండెంట్‌ శివ సోమవారం ఉదయం చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక యశ్వంత్‌ అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్కూల్‌ వద్దకు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మీకు సంబంధం లేదంటూ వారిపైనా శివ చిందులేశాడు. విలేకర్లను కూడా మీకు ఇక్కడ ఏం పని ఉంది? వెళ్లిపోండంటూ గెంటి వేయడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐ సురేష్‌ రెడ్డి, ఎంఈవో చక్రేనాయక్‌లు పాఠశాల వద్దకు చేరుకుని కరస్పాండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రాయచోటి డిప్యూటీ డీఈవో వరలక్ష్మి పాఠశాలకు చేరుకుని డీఈవో, ఆర్జేడీలకు ఫోన్‌ ద్వారా జరిగిన విషయాన్ని తెలిపారు. వారు స్పందించి స్కూల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఎంఈవో ఆదేశించారు.

మరిన్ని వార్తలు