విద్యార్థులకు మద్యం ఇచ్చారు

14 Dec, 2017 06:50 IST|Sakshi
విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు, విహారయాత్రకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులు

అస్వస్థతకు గురైన బాలలు

ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

తుమకూరు: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం మత్తులో తూగారు. విహారయాత్రకు వెంట తీసుకెళ్లిన విద్యార్థులకు మద్యం కలిపిన నీరు ఇచ్చి వారు అస్వస్థతకు గురయ్యేందుకు కారణమయ్యారు. ఈఘటన  తుమకూరు జిల్లాలోని కొరటగెరె తాలూకా బొమ్మలదేవిపుర గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి  ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9,10వ తరగతి విద్యార్థులు 30 మందిని  ధర్మస్థలం, హొరనాడు, దక్షిణ కన్నడ ప్రాంతాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  సచ్చిదానంద, ఉపాధ్యాయులు షేక్‌ ముజామిల్, రాథోడ్‌లు గత శుక్రవారం విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు మద్యం సేవించారు.

కొంత మద్యాన్ని ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీళ్లతో కలిపి నిల్వ ఉంచారు. తమకు దాహంగా ఉందని అడగడంతో విద్యార్థులకు ఆ బాటిళ్లను అందించారు. వాటిని తాగిన విద్యార్థులు సోమవారం ఇంటికి చేరుకున్న తర్వాత వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వైద్యులకు చూపించగా మద్యం కలిసిన నీరు సేవించినట్లు తేలింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు. మధుగిరి డీడీపీఐ రవిశంకర్‌రెడ్డి పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు