కడుపుకోత

14 Nov, 2018 13:05 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి, బంధువులు హర్ష (ఫైల్‌ఫొటో)

బాబూ నా బిడ్డ రోడ్డుపై పడిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. కాస్త ఆపండయ్యా అంటూ అప్పటికే చనిపోయిన కొడుకు కోసం వచ్చేపోయే వాహనాలను ఆపుతున్న ఆ తల్లిని చూసిన ప్రతి హృదయం శోక సంద్రమైంది. వడివడిగా బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మా టాటా అంటూ ఉదయాన్నే బయలుదేరిన బిడ్డ.. సాయంత్రం శవమై ఇంటికి చేరడంతో అ తల్లిదండ్రుల కడుపుకోత కన్నీటి చెలమలయ్యింది. తాడేపల్లి మండలం చిర్రావూరులో మంగళవారం స్కూల్‌ బస్‌ చక్రాల కింద పడి ఆరేళ్ల చిన్నారి ప్రాణం చితికిపోయింది. రోజూ తానెక్కే బస్సే మృత్యువై మింగేసింది. ఒక్కగానొక్క కొడుకు దూరమైన ఆ తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిల్చింది.

గుంటూరు, తాడేపల్లిరూరల్‌:  సాయంత్రం స్కూల్‌ నుంచి తమ ఏకైక గారాల పట్టీ వస్తాడని ఆ తల్లి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. కుమారుడి రాక కోసం రోడ్డుపైనే నిలబడిపోయింది. ఇంతలోనే కనుచూపు మేరలో ఓ విషాదం. స్కూల్‌ బస్సు కింద బాలుడి పడ్డాడ్డన్న చేదు వార్త. అది తన బిడ్డ కాకూడదని ఆతల్లి మనసులో అనుకుంటూ బస్సువైపు పరుగు తీసింది. అది తన బిడ్డనే అని తెలియగానే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన బిడ్డను కాపాడాలంటూ అడ్డువచ్చిన ప్రతి ఆటోను ఆపి మరీ వేడుకుంది. కానీ అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. విషయం చుట్టుపక్కల వారు తెలిపినా ఆ తల్లి మాత్రం ఆ మాటలను పట్టించుకోవడం లేదు.

తన బిడ్డను బ్రతికించాలని గుండెలవిసేలా ఆ భగవంతుడికి మొర పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిర్రావూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...  చిర్రావూరు గ్రామంలో నివసించే నారంశెట్టి భిక్షాలు అలియాస్‌ ముసలయ్య, సుజాతకు ఏకైక కుమారుడైన హర్ష (6) నూతక్కిలోని ఆదిత్య పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా బస్సు విద్యార్థులను దించేందుకు ఆగింది. హర్ష అందరికంటే మొదట బస్సు దిగి తోటి విద్యార్థులు దిగిన తరువాత మళ్లీ బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డ్రైవర్‌ బస్సును ముందుకు పోనివ్వడంతో హర్ష అదుపుతప్పి బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న తల్లికి స్థానికులు విషయం తెలపడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు