ప్రాణం తీసిన సరదా

9 Feb, 2019 12:24 IST|Sakshi
అక్మల్‌ మునిగిపోయిన కాలువలోని ప్రమాద స్థలం, (ఇన్‌సెట్‌) అక్మల్‌ మృతదేహం

హంద్రీ–నీవా కాలువలోకి దిగి విద్యార్థి మృతి

భయంతో పరుగులు తీసిన సహచరులు     

45 నిమిషాలు గాలించాక కొన ఊపిరితో ఉన్న విద్యార్థిని వెలికితీత

ఆస్పత్రికి తరలించేసరికి అప్పటికే మరణించినట్లు నిర్ధారణ

రోదనలతో మిన్నంటిన వాయలవంక

చిత్తూరు, బి.కొత్తకోట:  కృష్ణా జలాల్లో దిగాలన్న ఓ చిన్నారి కోరిక మృత్యుశాపమైంది. సహచరులతో కలిసి కాలువలో దిగిన అతడు మునిగిపోయి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులకు  అంతులేని దుఃఖాన్ని మిగిల్చాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని వాయలవంకకు చెందిన షేక్‌ మహమ్మద్‌ హుసేన్‌ కుమారుడు షేక్‌ మహమ్మద్‌ అక్మల్‌ (9) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. అక్మల్‌కు ప్రతి శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజు చేసే అలవాటు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి నుంచి వెళ్లిన అక్మల్‌ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు.

అయితే అక్మల్‌తో పాటు మరో ముగ్గురు చిన్నారులు బి.కొత్తకోట శివారులోని హంద్రీ–నీవా కాలువలో పారుతున్న కృష్ణాజలాలు చూసేందుకు వెళ్లారు. కాలువకు కుడివైపున మెషిన్‌ ఉన్న ప్రాంతం వద్ద గట్టు పైనుంచి అక్మల్‌ నీటిలోకి దిగాడు. మట్టి బురదగా ఉండటం, నీరుæలోతున్న చోటు కావడంతో అక్మల్‌ నీటిలో దిగగానే మునిగిపోయాడు. ఇది చూసిన అతని స్నేహితులు భయంతో పట్టణంలోకి పరుగులు తీశారు. అక్మల్‌ ఇంటికి వచ్చి అతడికి తల్లికి విషయం చెప్పడంతో ఆమె గుండెల్లో రాయి పడినట్లైంది. కుటుంబీకులు ఆందోళనతో కాలువ వద్దకు చేరుకుని 45 నిమిషాల పాటు గాలించారు. నీటిలో మునిగిపోయిన అక్మల్‌ను వెలికితీశారు. కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించి స్థానిక పీహెచ్‌సీకి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అక్మల్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనితో మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

విషాదంలో వాయలవంక
అక్మల్‌ మృతి గురించి తెలుసుకున్న వాయలవంక వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న అతడి తల్లిదండ్రులు, తాతను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎంపీపీ పాగొండ ఖలీల్, కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కో–ఆప్షన్‌ సభ్యుడు బావాజాన్, విద్యాశాఖ సిబ్బంది అక్మల్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మరిన్ని వార్తలు