వెళ్లిపోయావా నేస్తం..! 

22 Jun, 2019 08:11 IST|Sakshi
సంఘటనా స్థలంలో స్నేహితులు నర్సింహ, త్రినాథ్‌

సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : అప్పటి వరకు తరగతి గదిలో ఆనందంగా గడిపిన ఆ స్నేహితులు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే ఇళ్లకు పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటారనగా గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు వెంటాడింది. కళ్ల ముందే ప్రాణస్నేహితుడు మృత్యుఒడిలోకి జారుకుంటే.. ఎదురుగా తీవ్ర గాయాలతో మరో స్నేహితుడు చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలయ్యాయి. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన రెయ్యి త్రినాథ్, ఒడిశా రాష్ట్రం చీకటి కేవిటి సువానీ గ్రామానికి చెందిన గారపాన నర్సింహం ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ పురుషోత్తపురం మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

ఇచ్ఛాపురం మండలం బెన్నుగానిపేటకు చెందిన నారద అజయ్‌ సైతం వీరితో స్నేహంగా మెలిగేవాడు. త్రినాథ్‌ ఇంటి వద్ద తన బావకు చెందిన ద్విచక్ర వాహనం ఉండేది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో త్రినాథ్‌ అప్పుడప్పుడూ బైక్‌ నడుపుతుండేవాడు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట సెలవులు కావడంతో శుక్రవారం స్కూల్‌ విడిచిపెట్టిన వెంటనే బెన్నుగానిపేటకు చెందిన స్నేహితుడు అజేయ్‌ను ఇంటివద్ద దించేసి అక్కడి నుంచి కె.సువానీకి చెందిన మరో స్నేహితుడు నర్సింహులను దింపేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బెన్నుగానిపేట సమీపంలో ఒడిశా నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో త్రినాథ్‌ రోడ్డు ఎడమ వైపు తుళ్లిపోగా, బైక్‌ వెనుక కూర్చున్న నర్సింహ(14) రోడ్డుపై పడిపోవడంతో ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కొంత సమయానికి అటువైపుగా వచ్చిన స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించి త్రినాథ్‌ను ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు ఒడిశా బరంపురం రిఫర్‌ చేశారు. నర్సింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు బైరాగి, నర్సమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్‌ ఎస్సై కె.లక్ష్మీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు