కిడ్నాప్‌ కేసు దర్యాప్తు వేగవంతం

8 Feb, 2020 12:22 IST|Sakshi
బాలుడి ఆచూకీ కోసం రాజాను రంగంలోకి దింపుతున్న పోలీసులు

ఐదు రోజులైనా  ఆచూకీ లేని బాలుడు

రంగంలోకి దిగిన పోలీసు జాగిలాలు

అదుపులో అనుమానితులు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మచిలీపట్నం మండలం పెదకరగ్రహారంలో ఈ నెల 4వ తేదీన కిడ్నాప్‌కు గురైన విద్యార్థి నందు కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. బాలుడు అదృశ్యమై ఐదు రోజులు కావస్తుండటంతో పోలీసులు  ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలుడు కనిపించకుండా పోయిన పెదకరగ్రహారంతో పాటు మచిలీపట్నంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తూ బాలుడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. విద్యార్థి కిడ్నాప్‌ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు బాలుడి ఆచూకీ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు.

పోలీసుల అదుపులో అనుమానితులు..
బాలుడి తల్లి ఇచ్చిన సమాచారం మేరకు కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవనిగడ్డ జైలులో ఉన్న బాలుడి తండ్రి ప్రియురాలిపై తల్లి అనుమానం వ్యక్తం చేయటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న మహిళ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.

రంగంలోకి దిగిన రాజా..
బాలుడి కిడ్నాప్‌ గురైన స్వగ్రామమైన పెదకరగ్రహారంలో పోలీసు జాగిలం రాజాతో పాటు మరో జాగిలాన్ని  శుక్రవారం రంగంలోకి దింపారు. బాలుడి  చొక్కాను వాసన చూసిన జాగిలం రాజా తొలుత స్కూలు వద్దకు వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆగి మరలా అక్కడి నుంచి గ్రామానికి సమీపంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌ వెనుక ఉన్న ముళ్లపొదల్లోకి వెళ్ళి వాసన చూసింది. తిరిగి అక్కడి నుంచి గోడౌన్‌కు ఎదురుగా ఉన్న ఓ దేవాలయం వద్దకు వచ్చి అక్కడి నుంచి బాలుడు చదువుకునే పాఠÔశాల వద్దకు వచ్చి ఆగింది. అనుమానం వచ్చిన పోలీసులు మరో జాగిలం జానీని రంగంలోకి దింపగా జానీ ఆదే మార్గంలో పాఠశాల వద్దకు చేరింది. దీంతో పోలీసులు బాలుడి పాఠశాల వద్ద నుంచే అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు