విద్యార్థిని అనుమానాస్పద మృతి

21 Aug, 2019 11:13 IST|Sakshi
విద్యార్థిని మృతదేహం, మార్చురీ వద్ద రోదిస్తున్న తల్లి వందన

సాక్షి, కొత్తపల్లి(కరీంనగర్‌) : కొత్తపల్లి శివారులోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్‌–వందనల కుమార్తె బి.వైష్ణవి(9) నాల్గో తరగతి చదువుతూ అదే పాఠశాల హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల సెలవులు రావడంతో ఈనెల 10న తన ఇంటికి వెళ్లింది. ఈనెల 18న బాలికను ఆమె తండ్రి హాస్టల్‌లో వదిలివెళ్లాడు. సోమవారం అనారోగ్యంతో ఉన్న బాలికను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. మంగళవారం ఫిట్స్‌ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.

అయితే పోచమ్మ, దురద, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లిదండ్రులే ఆసుపత్రిలో చూపించి తగ్గకుండానే మందులతో హాస్టల్‌లో వదిలి వెళ్లారని యాజమాన్యం చెబుతుండగా..జ్వరం తగ్గాకే హాస్టల్‌లో వదిలి వెళ్లామని, మందులు వాడే విధానాన్ని టీచర్‌కు తెలపాల్సిందిగా సోమవారం ఫోన్‌లో తెలపడం జరిగిందని, ఇంతలోనే మంగళవారం మధ్యాహ్నం మీ కూతురుకు ఫిట్స్‌ వచ్చాయని, సీరియన్‌గా ఉందని ఫోన్‌లో తెలపడంతోనే కరీంనగర్‌కు చేరకున్నామని, ఇక్కడికి రాగానే చిట్టితల్లి విగతజీవిగా మార్చురీలో పడుందని తల్లి వందన బోరున విలపించింది.

విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వైష్ణవి మృతి చెందిందని కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌టీఎస్‌ఎఫ్, ఏఐఎస్‌బీ, ఎల్‌హెచ్‌పీఎస్‌ విద్యార్థి సంఘాలు మార్చురీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. çసంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్‌ టూటౌన్, రూరల్‌ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. 

విచారణ జరిపించాలి..
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ రూరల్‌ సీఐ శశిధర్‌రెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను బయటకు తీస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బుర్ర సంజయ్, గుగులోత్‌ రాజునాయక్, జూపాక శ్రీనివాస్, గవ్వ వంశీధర్‌రెడ్డి, గట్టు యాదవ్, మల్లేశం, రత్నం రమేశ్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు