పాఠశాల విద్యార్థుల పందేలు!

13 Apr, 2019 06:44 IST|Sakshi

శంషాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ల జోరు  

అంతా ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులే..

డబ్బుల విషయంలో ఘర్షణపడుతున్న బాలురు

విద్యార్థుల తీరుపై తల్లిదండ్రుల్లో ఆందోళన

శంషాబాద్‌: శంషాబాద్‌లో ఐపీఎల్‌ పందేలు జోరుగా సాగుతున్నాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఐపీఎల్‌ పందేలు కాస్తున్నారు. డబ్బుల విషయంలో తేడాలు వస్తే ఘర్షణకు దిగుతున్నారు. తాజాగా మధురానగర్, ఆర్బీనగర్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఐపీఎల్‌ పందెం డబ్బుల విషయమై గొడవలకు దిగారు. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదే విషయమై తాజాగా గురువారం కూడా మరో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కాలనీలో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థులను మందలించి సర్దిచెప్పారు. పందేలుకాసే విద్యార్థులంతా ఏడో తరగతి నుంచి పదోతరగతి లోపు విద్యార్థులే. స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ తీరుగా ఐపీఎల్‌ పందేల ఉచ్చులో చిక్కుకుపోతున్న తీరుతో తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.  

మొహిన్‌ మహల్లాలో..
పట్టణంలో మొహిన్‌ మహల్లా బస్తీ ఐపీఎల్‌తో పాటు సాధారణ క్రికెట్‌ పోటీల పందెలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గతంలో పలుమార్లు ఇక్కడ ఐపీఎల్‌ పందెం రాయుళ్లను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిఘా కొరవడడడంతో ప్రతిరోజు లక్షల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుపోయిన కొందరు యువకులు ఇప్పటికే లక్షల రూపాయల్లో అప్పుల పాలయ్యారు. గతంలో ఐపీఎల్‌ పందెలుకాసి ఏకంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డుపాలైన వ్యక్తులు స్థానికంగా పదుల సంఖ్యల్లోనే ఉన్నారు. ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభం కావడంతో స్థానికంగా పందేల జోరు కొనసాగుతోంది. రెండురోజుల కిందట పందెంలో డబ్బులు కాసి ఓడిపోయిన వ్యక్తి దళారీకి డబ్బులు చెల్లించకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌లలో స్థానికంగా కొందరు యువకులు  దళారులుగా ఉండి నగరంలో బెట్టింగ్‌ నిర్వహించే వారితో అనుసంధానంగా దందా నడిపిస్తున్నారు. పందెం కాసే వారికి వీరే డబ్బు సమకూర్చుతున్నారు. తీరా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చే సమయానికి దాడులు కూడా చేస్తున్నారు. బెట్టింగ్‌లపై పోలీసుల నిఘాను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు