విద్యార్థుల మిస్సింగ్‌ కలకలం

6 Feb, 2019 11:42 IST|Sakshi
విద్యార్థుల ఇళ్ల వద్ద గుమికూడిన బంధువులు, గ్రామస్తులు విద్యార్థులు గోవర్ధనరెడ్డి, శరత్‌రెడ్డి (ఫైల్‌)

రాయదుర్గంలో రాత్రి అదృశ్యం

మరుసటి రోజు ఉదయం బెంగళూరులో ప్రత్యక్షం

కర్ణాటక పోలీసుల అదుపులో చిన్నారులు

మరో రెండు రోజుల వరకు అక్కడే

ముగ్గురు విద్యార్థుల ‘మిస్సింగ్‌’రాయదుర్గంలో కలకలం రేపింది.పాఠశాల నుంచి హాస్టల్‌ వద్దకు వెళ్లిన విద్యార్థులు కనిపించకుండా పోయారనే విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది.తమ బిడ్డలను ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఎక్కడికైనా వెళ్లిపోయారా అనేఅనుమానాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరుసటి రోజు ఉదయానికి దొరికారనే ఫోన్‌ కాల్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం, గుమ్మఘట్ట: గుమ్మఘట్ట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధనరెడ్డి (8వ తరగతి), శరత్‌రెడ్డి (5వ తరగతి), డీ హిరేహాళ్‌ మండలం కొత్తూరుకు చెందిన హరి (7వ తరగతి) రాయదుర్గంలోని సెయింట్‌పాల్స్‌ స్కూల్‌లో చదువుతున్నారు. బేలోడుకు చెందిన సమీప బంధువులు రాయదుర్గం ఇంట్లోనే చిన్న హాస్టల్స్‌ నిర్వహిస్తుండడంతో అక్కడ ఉంటూ స్కూలుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం స్వగ్రామాలకు వెళ్లి యథావిధిగా సోమవారం ఇంట్లో ఖర్చుల కోసం డబ్బు తీసుకుని హాస్టల్‌కు వచ్చారు. లగేజీ అక్కడ ఉంచి పాఠశాలకు వెళ్లారు. పాఠశాల వదిలిన తర్వాత హాస్టల్‌కు చేరుకున్నారు. ట్యూషన్‌కు వెళ్తాతామని తోటి విద్యార్థులకు తెలిపి పుస్తకాలు బయట ఉంచి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. 

ముగ్గురూ రైలెక్కారు..
సమీపానున్న రైల్వేస్టేషన్‌కు చేరుకుని రాత్రి 7 గంటలపైన గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో హాస్టల్‌ నిర్వాహకులు స్కూల్‌ వద్దకెళ్లి విచారించారు. ట్యూషన్‌కే రాలేదని అక్కడ ఉపాధ్యాయులు చెప్పడంతో గందరగోళానికి గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.

సోషల్‌ మీడియాలోహల్‌చల్‌
ఈ విషయం ఆనోట ఈ నోట పడటంతో పాటు వాట్సప్, ఫేస్‌బుక్‌ సోషియల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. కొత్తూరుకు  చెందిన హరి బంధువులు బెంగళూరులో ఉండడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాన్ని గుర్తించారు. అనుమానం కలిగి వారు బెంగళూరు రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకుని గస్తీ చేపట్టారు. మంగళవారం వేకువజామున ఐదు గంటలకు ప్యాసింజర్‌ రైలు నుంచి ముగ్గురు విద్యార్థులు దిగుతుండటం గమనించి పట్టుకున్నారు. 

అనుమానంతో అదుపులోకితీసుకున్న పోలీసులు
బెంగళూరులో రైల్వే పోలీసులు అనుమానంతో హరి బంధువులను, పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ బిడ్డలు మీ వారో కాదో..? తామెలా నమ్మేది అంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చైల్డ్‌ వెల్ఫేర్‌కు తరలించారు. జరిగిన విషయాన్ని ఫోన్‌ ద్వారా చేరవేయడంతో రాయదుర్గం ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ అక్కడి పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు. వీడియో కాల్‌ ద్వారా విద్యార్థులను తల్లిదండ్రులకు చూపించారు. 

పిల్లల రాకకు మరో రెండు రోజులు
అక్కడి నిబంధనల ప్రకారం సోమ, లేదా గురువారాల్లో మాత్రమే ఇలాంటి కేసులు విచారిస్తారు. గురువారం వరకు వదిలేది లేదని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆధార్‌కార్డు, పిల్లల ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వస్తే తప్ప పంపేది లేదని చెప్పడంతో చెప్పడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. బిడ్డల కోసం ఇంకా రెండు రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని విలపించారు. విద్యార్థులు ఇలా ఎందుకు వెళ్లి పోయారో తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు