రవిప్రకాశ్‌ కోసం గాలింపు ముమ్మరం!

28 May, 2019 02:17 IST|Sakshi

గుజరాత్, ముంబైలకు ప్రత్యేక టీంలు

బెంగళూరు, విజయవాడల్లోనూ గాలింపులు

ఏపీ నుంచి మరోచోటుకు వెళ్లి ఉంటాడని పోలీసుల అనుమానం

సాక్షి, హైదరాబాద్‌: టీవీ 9 చానల్‌ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగం, బంజారాహిల్స్‌ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రవిప్రకాశ్‌ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భంగపాటే మిగిలింది. 

ఏపీ వదిలి వెళ్లాడా? 
తెలంగాణ నుంచి పరారైన రవిప్రకాశ్‌ ఏపీలోని అప్పటి అధికార పార్టీ నేతల వద్ద తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరోచోటుకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్‌లోనూ రవిప్రకాశ్‌ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్‌ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్‌కార్డులు మార్చాడని సమాచారం. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు