రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

20 Mar, 2020 09:14 IST|Sakshi
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న జింక కొమ్ములు

వెంకటా చలపతి నాయుడు అక్రమ సంపాదన 20 కోట్లు..

జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు

సాక్షి, తిరుపతి: తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌( డిఎఫ్‌ఓ) వెంకటా చలపతి నాయుడు అక్రమ ఆస్తులపై రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు సహచర ఉద్యోగులు వెంకటరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, మాధవరావు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటా చలపతి నాయుడు 20 కోట్ల రూపాయలు దాకా అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన  నివాసంలో 14 జింక కొమ్ములను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో వెంకటా చలపతి నాయుడు నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం చంద్రగిరి మండలం ముంగిలిపట్టు, అత్తగారి గ్రామం నుండుపల్లిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. బెంగుళూరులో వెంకటా చలపతి నాయుడు బావమరిది నివాస గృహంలో కూడా మరో బృందం సోదాలు చేపట్టింది. 

టీకే వీధిలో వెంకటా చలపతి నాయుడుకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఆరు అంతస్తుల భవనం, అన్నారావు సర్కిల్‌లో 8 కోట్ల విలువైన ఆరు అంతస్తుల భవనం, గోవిందరాజా స్వామి నార్త్‌ మాడ వీధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు, బెంగుళూరు,చిత్తూరు, కడప జిల్లా రాయచోటిలలో పలు ఆస్తులను గుర్తించారు. మొత్తం ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట చలపతి నాయుడు అక్రమ ఆస్తుల బాగోతంపై అటవీశాఖలో విస్తృత చర్చ జరుగుతుంది.

మరిన్ని వార్తలు